బ్యాన్ వల్లే ఎక్కువ మంది చూసారా?

సినిమాలను అడ్డుకోవడం లేదా బ్యాన్ చేయడం వల్ల వాటి క్రేజ్ తగ్గడం పక్కన పెడితే నెటిజన్లలో క్యూరియాసిటీ మరింత పెరుగుతుందని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ అభిప్రాయపడ్డారు. దిల్జీత్ దోసాంజ్ లీడ్ రోల్ లో నటించిన ‘సట్లజ్’ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్ నుండి హఠాత్తుగా మాయమవ్వడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఒక చిత్రాన్ని ఎంతగా నిషేధిస్తే దానిని చూడాలనే కోరిక జనాల్లో అంతకంటే ఎక్కువగా పెరుగుతుందంటూ ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే 1995 కాలంలో పంజాబ్ లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పంజాబ్ పోలీస్ డిపార్ట్ మెంట్ దాదాపు 25 వేల శవాలను అక్రమంగా కాల్చేసిందనే నిజాన్ని బయటపెట్టిన తర్వాత ఆయన ఎలా మాయమయ్యాడు అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇంతటి సెన్సిటివ్ సబ్జెక్ట్ కావడం వల్లే ఈ సినిమాకు ఇన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి.

నిజానికి ఈ సినిమా గత మూడేళ్లుగా సెన్సార్ బోర్డుతో పెద్ద పోరాటమే చేసింది. థియేటర్లలో విడుదల చేద్దామనుకుంటే ఏకంగా 125 కట్స్ చెప్పడంతో మేకర్స్ వెనక్కి తగ్గారు. చివరకు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కు వచ్చింది. కానీ ఏమైందో ఏమో గానీ కేవలం రెండు రోజుల్లోనే ఎలాంటి ప్రకటన లేకుండా దీనిని ప్లాట్‌ఫామ్ నుండి తొలగించారు. ఈ పరిణామంతో అప్పటివరకు సినిమా గురించి పెద్దగా తెలియని వారు కూడా అసలు ఇందులో ఏముందో తెలుసుకోవాలని తెగ వెతుకుతున్నారు.

తాను కూడా మొదట ఈ సినిమా చూడాలనుకోలేదని, కానీ ఇప్పుడు ఎందుకు బ్యాన్ చేశారో తెలుసుకోవడానికైనా కచ్చితంగా చూస్తానని అనురాగ్ కశ్యప్ రాసుకొచ్చారు. మరోవైపు ఈ చిత్రంపై టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఎక్స్ వేదికగా తన రివ్యూ ఇచ్చారు. సట్లజ్ అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, మన చరిత్రలోని ఒక చీకటి అధ్యాయాన్ని గుర్తుచేసే ఒక పెద్ద గాయమని ఆయన పేర్కొన్నారు.

ఇందులో దిల్జీత్ దోసాంజ్ ఎలాంటి రొటీన్ హీరో ఎలివేషన్స్ లేకుండా కేవలం తన అంతరాత్మతో అద్భుతంగా నటించాడని కొనియాడారు. అలాగే మరో నటుడు అర్జున్ రాంపాల్ పాత్ర కూడా చాలా రియలిస్టిక్ గా ఉందంటూ ప్రశంసించారు. దర్శకుడు హనీ ట్రెహాన్ ఎక్కడా హడావుడి చేయకుండా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లాగా ఈ కథను నడిపించాడని, ఇలాంటి ధైర్యమైన సినిమాలను సెన్సార్ చేయవద్దని వర్మ కోరారు.