అనుభవం తోడయ్యుంటే ‘బంధం’ బలంగా ఉండేది    

ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా అయినప్పటికీ హీరో, దర్శకుడు ఎలాంటి ఇమేజ్ లేని వాళ్ళు కావడంతో ఆడియన్స్ మొదటిరోజు వస్తారానే అనుమానాలు ట్రేడ్ వర్గాల్లో ఉండేవి. కానీ వాటిని పటాపంచలు చేస్తూ నాగబంధం డీసెంట్ నెంబర్లు నమోదు చేసింది. రికార్డులు బద్దలయ్యే రేంజ్ కాదు కానీ తీవ్రమైన పోటీగా కనిపించిన రావు బహదూర్ ని డామినేట్ చేయడం విశేషమే.

హీరో విరాట్ కర్ణ డెబ్యూ మూవీ పెదకాపు డిజాస్టర్. నటన పరంగా గుర్తింపు రాలేదు. రెండో ఛాన్స్ ఏకంగా ఇంతపెద్ద విజువల్ గ్రాండియర్ రూపంలో దక్కింది. ఒకరకంగా అదృష్టమే. దర్శకుడు అభిషేక్ నామా గతంలో కళ్యాణ్ రామ్ డెవిల్ తీశారు. దాని ఫలితం తెలిసిందే. ఇప్పుడు దానికి అయిదింతల పెద్ద స్కేల్ లో నాగబంధం తెరకెక్కించారు. హిందీతో సహా ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేశారు. నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ మొదటి మూడు రోజులు మంచి కలెక్షన్లు వచ్చాయి.

అయితే అభిషేక్ నామాకు అనుభవం తక్కువగా ఉండటం వల్ల ఇంత పెద్ద ప్రాజెక్టు సరైన రీతిలో హ్యాండిల్ చేయలేదన్నది వాస్తవం. కొన్ని సన్నివేశాలు, ఎపిసోడ్స్ బాగున్నాయి. కానీ మూడు గంటల నిడివిని మోయడానికి అవి సరిపోలేదు. టెక్నికల్ గా ఆయనకు బలమైన గ్రిప్ లేకపోవడం వల్లే కంటెంట్ పట్ల ఇలాంటి రెస్పాన్స్ వచ్చిందనేది స్పష్టం. విరాట్ కర్ణ కూడా యాక్టింగ్ పరంగా ఇంకా మెరుగు పడాల్సింది చాలా ఉన్న దశలో ఇంత పెద్ద పాత్ర పోషించాడు.

సింపుల్ గా చెప్పాలంటే కార్తికేయ 2 ఎందుకు అంత పెద్ద హిట్టయ్యింది, అంజి ఎందుకు ఫ్లాప్ అయ్యిందనే కారణాలు విశ్లేషించుకుంటే నాగబంధం లాంటివి కూడా సక్సెస్ అయ్యేందుకు బోలెడు అవకాశాలుంటాయి. రిలీజైన మూడో రోజు ఇరవై నిముషాలు కట్ చేయడం చిన్న విషయం కాదు. అదేదో ముందే గుర్తించి ఉంటే డ్యామేజ్ తగ్గేది. ఆదివారం గత ఇరవై నాలుగు గంటల్లో రావు బహదూర్ కేవలం 7 వేల పై చిలుకు టికెట్లు అమ్మగా, నాగబంధం 22 వేల టికెట్లతో దానికన్నా చాలా పైన ఉండటం ఆడియన్స్ తీర్పుని తేటతెల్లం చేస్తోంది.