ఎల్లమ్మ అనే పేరు ఎన్ని నెలలుగా వింటున్నామో టాలీవుడ్ జనాలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు యెల్దండి డైరెక్షన్లో రూపొందిస్తున్న ఈ డివోషనల్ డ్రామా తాలూకు షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది. ప్రస్తుతం హీరో హీరోయిన్ అవసరం లేని సన్నివేశాలు, ఎపిసోడ్లు తీస్తుండగా ఇదే నెలలో దేవి సెట్లోకి అడుగు పెట్టబోతున్నాడు. అయితే కథానాయికకు సంబంధించిన చిక్కుముడి ఇంకా వీడలేదట.
లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో భాగశ్రీ బోర్సే వద్దకు ఎల్లమ్మ ప్రస్తావన వచ్చింది. కాల్ షీట్స్ సమస్య వల్ల వదులుకోవాల్సి వచ్చిందని చెప్పింది తప్ప అలాంటిదేమీ జరగలేదని కొట్టి పారేయలేదు. వచ్చిన వాస్తవాన్ని ఒప్పుకుంది.. అంటే ప్రతిపాదన ఈ కాంత సుందరి దగ్గరికి వెళ్లిందన్న మాట. తనకన్నా ముందు సాయిపల్లవి, కీర్తి సురేష్, శ్రీలీలను కూడా అడిగారు కానీ రకరకాల కారణాల వల్ల సానుకూల స్పందన రాలేదన్నది గతంలో వినిపించిన టాక్.
ఫైనల్ గా ఎవరిని లాక్ చేసుకుంటారో ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. పెర్ఫార్మన్స్ ఎక్కువ డిమాండ్ చేసే క్యారెక్టర్ హీరోకే కాదు ఎల్లమ్మలో హీరోయిన్ కూ ఉందట. ముఖ్యంగా క్లైమాక్స్ చివరి ఇరవై నిముషాలు కెరీర్ మొత్తం గుర్తుండిపోయేలా వేణు డిజైన్ చేశారట. కాకపోతే దేవికి నటుడిగా ఇమేజ్ లేకపోవడం వల్ల వెంటనే గ్రీన్ సిగ్నల్స్ రావడం లేదట. ప్రస్తుతం మరో రెండు ఆప్షన్లు పెట్టుకున్నారని, ఒకరిని ఫైనల్ చేసి త్వరలోనే ప్రకటించే ఛాన్స్ ఉందట .
ఈ ఏడాది ఎల్లమ్మని విడుదల చేసే అవకాశాలు తగ్గిపోతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ ఎక్కువ సమయం డిమాండ్ చేసే ప్రాజెక్టు కావడంతో 2027 ప్రథమార్ధంలో రిలీజ్ ఆశించవచ్చు. దేవి దీని కోసమే నెలలో పదహేను నుంచి ఇరవై రోజులు కాల్ షీట్స్ ఇవ్వబోతున్నాడు. మ్యూజిక్ పరంగా కొత్త కమిట్ మెంట్స్ కొన్ని ఎల్లమ్మ వల్లే వదులుకోవాల్సి వచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఇంతకీ దేవి పక్కన జోడిగా నటించే ఛాన్స్ దక్కించుకునే భామ ఎవరో ఇంకా వేచి చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates
