అంచనాల మీటర్ సరిగ్గా మొదలుపెట్టారు

లీకైన విడుదల తేదీ అఫీషియల్ అయిపోయింది. జైలర్ 2 రిలీజ్ డేట్ అక్టోబర్ 15 ఖరారు చేస్తూ చిన్న వీడియో టీజర్ ని అభిమానులకు కానుకగా ఇచ్చారు. ఇందులో మెయిన్ ఆర్టిస్టులను ఒక్కో షాట్ ద్వారా వేగంగా రివీల్ చేస్తూ కంటెంట్ శాంపిల్స్ చూపించారు. ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి. రజని అంటే చాలు పూనకం వచ్చినట్టు బిజిఎం ఇచ్చే ఈ మ్యూజిక్ సెన్సేషన్ మరోసారి ఆ మేజిక్ రిపీట్ చేసేలా కనిపిస్తున్నాడు.

మొత్తానికి అంచనాలకు బలమైన పునాది వేయడంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ సక్సెస్ అయ్యారు. మొదటి భాగం విలన్ వినాయకన్ ఫస్ట్ పార్ట్ చివరిలో చెప్పే డైలాగుతో మొదలుపెట్టి ఈసారి విలన్ గ్యాంగ్ చాలా పెద్దది ఉంటుందనే పాయింట్ ని బయట పెట్టారు. రజని లుక్స్ ని ఎక్కువ చూపించకుండా దాచి పెట్టారు. క్యామియోలు చేసినట్టుగా ప్రచారం జరిగిన విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ ని సైతం హైడ్ చేశారు. హృతిక్ రోషన్ సంగతి సరేసరి.

రజనీకాంత్ కు జైలర్ 2 చాలా ముఖ్యం. ఎందుకంటే జైలర్ తర్వాత మూడు ఫ్లాపులు వచ్చాయి. క్యామియో అయినప్పటికీ తన పేరు మీద బిజినెస్ చేసిన లాల్ సలాం దారుణంగా పోయింది. అద్భుతాలు చేస్తుందన్న వెట్టయన్ ఫ్లాప్ అయ్యింది. ఆకాశమే హద్దుగా హైప్ వచ్చిన కూలి నిరాశపరిచింది. అయిదు వందల కోట్లు వసూలు చేసినా కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ఇప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే జైలర్ 2 బ్లాక్ బస్టర్ కావాల్సిందే.

తెలుగు హక్కులు ఎవరికి దక్కుతాయనేది ఇంకా ఫైనల్ కాలేదు. కూలి యాభై కోట్లకు అమ్ముడుపోగా దాని మీద ఇంకో ఇరవై కోట్లు అదనంగా నిర్మాతలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. పోటీ అయితే గట్టిగానే ఉంది. దసరాకు చిరంజీవి విశ్వంభర పోటీ ఉండొచ్చనే వార్తల నేపథ్యంలో చిరంజీవి రజనీకాంత్ క్లాష్ ఎలా ఉంటుందనే ఆసక్తి బయ్యర్ వర్గాల్లో మొదలయ్యింది. జైలర్ 2 సక్సెస్ అయితే నెల్సన్ తర్వాత హ్యాండిల్ చేస్తున్న రజినీకాంత్ కమల్ హాసన్ మల్టీస్టారర్ కి మరింత బలం చేకూరుతుంది.