రంగస్థలం పోలిక ఎందుకు వస్తోందంటే

జూలై 10 విడుదల కాబోతున్న లెనిన్ ప్రమోషన్లు ఊపందుకున్నాయి. ఈసారి గ్యారెంటీ హిట్టు కొడతాడనే నమ్మకం అఖిల్ లో పుష్కలంగా కనిపిస్తోంది. వరసబెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తనతో ఉంటూ పబ్లిసిటీలో తన వంతు పాత్ర పోషిస్తోంది. కమర్షియల్ గా పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత థియేటర్లకు మంచి రెవెన్యూ ఇచ్చే మూవీగా బయ్యర్ వర్గాలు లెనిన్ మీద ఆశలు పెట్టుకున్నాయి. అంచనాలు పెరిగేందుకు ట్రైలర్ ఉపయోగపడింది.

ఇక పలు సందర్భాల్లో అఖిల్ రంగస్థలం ప్రస్తావన తేవడం ఆసక్తి రేపుతోంది. రామ్ చరణ్ తనకు ఎంతో ఇష్టమైన స్నేహితుడు అయినప్పటికీ ఎందుకు ఆ చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నాడనే ప్రశ్నకు సమాధానం లేకపోలేదు. రంగస్థలం లాగే లెనిన్ కూడా పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. అది కాదు అసలు పాయింట్. అందులో ఎలా అయితే ఊహించని ట్విస్టులు షాక్ ఇస్తాయో అదే తరహాలో లెనిన్ లో కూడా కొన్ని మలుపులు థ్రిల్ చేస్తాయని టాక్.

అందుకే ప్రత్యేకంగా లెనిన్ రంగస్థలంని గుర్తు చేసుకుంటున్నాడని అంటున్నారు. నిజానికి కొందరు ట్రైలర్ ని డీ కోడ్ చేసి కథ ఎలా ఉంటుందనేది రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. అయితే అసలు ట్విస్టులు వేరే ఉంటాయని, కావాలని డైవర్ట్ చేయడం కోసమే అలా కట్ చేశారని యూనిట్ టాక్. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే థియేటర్లలో మొదటి షో పడే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఫైనల్ కాపీ సిద్ధం చేసే పనిలో దర్శకుడు మురళికిషోర్ టీమ్ బిజీగా ఉంది.

అన్నపూర్ణ, సితార సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న లెనిన్ కనక మెప్పించగలిగితే కనీసం రెండు వారాల పాటు ఓపెన్ గ్రౌండ్ దొరుకుతుంది. వసూళ్ల పరంగా దొరికే అడ్వాంటేజ్ అఖిల్ కు వరంగా మారుతుంది. కాంపిటీషన్ పెద్దగా లేదు. ఒకవేళ నాగబంధం, రావు బహదూర్ కనక యునానిమస్ అనిపించుకుంటే అవి రెండో వారం కొనసాగి కొంత ఎఫెక్ట్ అవ్వొచ్చు కానీ మాస్ ఆడియన్స్ కోణంలో చూసుకుంటే వాళ్ళ మొదటి ప్రాధాన్యం లెనినే అవుతుంది.