భోగి మంటల్లో శత్రువుల దహనం  

టాలీవుడ్ తెరమీద రక్తధారలు కొనసాగుతున్నాయి. హీరోలు మారుతున్నా వయొలెన్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కాసులు కురిపించే దిశగా ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న భోగి వచ్చే వారం నవంబర్ 27 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే పలు వాయిదాలు పడటంతో ఈసారి హిట్టు కొట్టాలన్న లక్ష్యంతో పక్కా ప్లానింగ్ తో దిగుతున్నారు. ఇవాళ జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ జరిగింది. కథేంటో క్లుప్తంగా చెప్పేశారు.

దశాబ్దాల వెనుకటి కథ ఇది. తెలంగాణలోని ఒక మారుమూల ఊరు బొగ్గులగుట్ట. పటేల్ వర్గం చెప్పుచేతల్లో వాళ్ళు చెప్పే పనులు చేస్తూ జీవనోపాధి చూసుకోవడం అక్కడి మగాళ్ల జీవితం. గంగ (శర్వానంద్) అయిదుగురు చెల్లెళ్లను ప్రాణంగా చూసుకునే అన్నయ్య. గ్రామంలో ఏదో తప్పు జరుగుతోందని గుర్తించి అయినవాళ్లను నిలదీస్తాడు. దీని వల్ల పటేల్ గ్యాంగ్ తో శత్రుత్వం ఏర్పడుతుంది. దీంతో ప్రాణాలకు తెగించి ప్రమాదాలకు ఎదురు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. తర్వాత జరిగేది అసలు స్టోరీ.

కెరీర్ లో మొట్టమొదటిసారి శర్వానంద్ ఇంత మాస్ క్యారెక్టర్ చేయడం. స్లాంగ్, గెటప్ అన్నీ కొత్తగా ఉన్నాయి. నేపథ్యం మరీ డిఫరెంట్ గా లేకపోయినా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని వాళ్లకు అనుగుణంగా సంపత్ నంది ఇచ్చిన ట్రీట్ మెంట్ అనుకున్న టార్గెట్ ని రీచ్ అయ్యేలా ఉంది. హీరోయిన్ వెంట పడి పాటలు పడటం, రెగ్యులర్ ఫార్ములాలో హీరోని ప్రెజెంట్ చేయడం కాకుండా కాన్సెప్ట్ కే కట్టుబడిన వైనం మూడు నిమిషాల వీడియోలో స్పష్టంగా అర్థమయ్యింది.

అంచనాలు ఏర్పడేందుకు సరిపడా కంటెంట్ అయితే భోగి ట్రైలర్ ఇచ్చేసింది. ఇక దాన్ని థియేటర్లలో నిలబెట్టుకోవడం మిగిలింది. రచ్చ తర్వాత మళ్ళీ అంత పెద్ద విజయం కోసం ఎదురు చూస్తున్న సంపత్ నంది ఆశలన్నీ భోగి మీదే ఉన్నాయి. ఎలాగూ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హైందవ, రష్మిక మందన్న మైసా తప్పుకున్నాయి కాబట్టి ఆ అడ్వాంటేజ్ భోగికి బాగా ఉపయోగపడుతుంది. టాక్ పాజిటివ్ వస్తే మటుకు శర్వా కెరీర్ లో బిగ్గెస్ట్ నెంబర్లు చూడొచ్చు. ఫ్యాన్స్ ఆ నమ్మకంతోనే ఉన్నారు.