అఖిల్ ఒంటికి ఇన్ని గాయాలా?

తొలి చిత్రం ‘అఖిల్’తోనే సూపర్ స్టార్ అయిపోతాడని అఖిల్ అక్కినేని మీద అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ చిత్రం డిజాస్టర్ అయింది. తన తర్వాతి మూడు చిత్రాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కాస్త పర్వాలేదనిపించింది. ఐతే మాస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో అఖిల్ జట్టు కట్టిన ‘ఏజెంట్’ మూవీతో అంతా మారిపోతుందని.. అభిమానులు కోరుకునే బ్లాక్ బస్టర్ తన సొంతమవుతుందని.. అతను స్టార్‌గా అవతరిస్తాడని ఆశిస్తే.. అది మరింత నిరాశను మిగిల్చింది. 

ఆ సినిమా ఫలితమే పెద్ద బాధ అంటే.. దాని రిలీజ్ తర్వాత అఖిల్ ఎంత పెద్ద ప్రమాదం ఎదుర్కొన్నాడో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. రెండు సర్జరీలు జరగడమే కాదు.. ఏకంగా 48 కుట్లు పడే స్థాయిలో తనకు యాక్సిడెంట్ జరిగిందట షూటింగ్ టైంలో. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ గురించి ‘లెనిన్’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అఖిల్ వెల్లడించాడు.

‘ఏజెంట్’ సినిమా రిలీజైన మూడు నెలలకు అఖిల్ బాత్రూంలో జారిపడ్డాడట. గాజు ముక్కలు అతడి చేతికి బలంగా గుచ్చుకున్నాయట. ఎడమ చేతి వేళ్లకు రెండు శస్త్రచికిత్సలు జరగడంతో పాటు 48 కుట్లు పడ్డాయట అఖిల్‌కు. దీంతో ఎనిమిది నెలల పాటు బరువులు ఎత్తలేని స్థితికి చేరుకున్నానని.. మొత్తంగా ఈ గాయం నుంచి కోలుకోవడానికి 16 నెలలు పట్టిందని అఖిల్ వెల్లడించాడు. ‘ఏజెంట్’ తర్వాత అఖిల్ కెరీర్లో చాలా గ్యాప్ రావడానికి ఆ సినిమా డిజాస్టర్ కావడమే కారణమని అంతా అనుకున్నారు. 

కానీ ఈ ప్రమాదం వల్లే అఖిల్ అంత గ్యాప్ తీసుకున్నాడని అర్థమవుతోంది. ఈ గ్యాప్‌లో అనేక కథలు విని.. చివరికి ‘లెనిన్’ స్టోరీని ఫైనలైజ్ చేసినట్లున్నాడు. అఖిల్ ఇంత పెద్ద సమస్య ఎదుర్కొన్నాడని తెలిసి అభిమానులు ఇప్పుడు అవాక్కవుతున్నారు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ దర్శకుడు మురళీ కిషోర్ రూపొందించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే ఇందులో కథానాయిక.