బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన కొన్ని సినిమాలు తర్వాత టీవీల్లో, ఆన్ లైన్లో మంచి స్పందన తెచ్చుకుంటూ ఉంటాయి. ఆ సినిమాలు థియేటర్లలో ఎందుకు సరిగా ఆడలేదో అన్న అనుమానం కలిగిస్తాయి. మహేష్ బాబు కెరీర్లో ఇలాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. గతంలో ‘ఖలేజా’.. కొన్నేళ్ల ముందు వచ్చిన ‘గుంటూరు కారం’ ఇలాంటి ప్రశ్నలే రేకెత్తిస్తుంటాయి. ‘గుంటూరు కారం’ను ఇప్పుడు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేవాళ్లు చాలామందే ఉన్నారు.
కానీ ఆ చిత్రం 2024 సంక్రాంతికి రిలీజైనపుడు అనుకున్నంతగా ఆడలేదు. ఐతే ఇందుకు సినిమాలో కంటెంట్ కంటే బయటి విషయాలే కారణమని అంటున్నాడు నిర్మాత నాగవంశీ. ‘గుంటూరు కారం’కి పోటీగా రిలీజైన ‘హనుమాన్’ సినిమాకు థియేటర్ల విషయంలో అన్యాయం జరుగుతోందన్న భావన జనాల్లో కలిగి తమ సినిమా మీద నెగెటివ్‌గా మారిందని నాగవంశీ చెప్పాడు.
‘గుంటూరు కారం’ చిత్రానికి ఆంధ్ర, రాయలసీమల్లో మంచి రెస్పాన్స్ వచ్చిందని నాగవంశీ తెలిపాడు. కానీ నైజాం, ఓవర్సీస్‌లో మాత్రం సినిమా సరిగా ఆడలేదన్నాడు. ఐతే సినిమా ఎంత బాగుంది, అందులో నెగెటివ్ అంశాలు ఏం ఉన్నాయి అన్న దాని కంటే.. బయటి నెగెటివిటీ సినిమా మీద ఎక్కువ ప్రభావం చూపిందని నాగవంశీ తెలిపాడు. ‘గుంటూరు కారం’ కోసం థియేటర్లన్నీ లాగేసుకున్నారు, ‘హనుమాన్’ చిత్రానికి స్క్రీన్లు ఇవ్వట్లేదు అన్న అభిప్రాయం బలంగా జనాల్లోకి వెళ్లిపోయి అది తమ సినిమాను దెబ్బ కొట్టిన మాట వాస్తవమని నాగవంశీ అన్నాడు.
మరి నిజంగా ‘హనుమాన్’కు థియేటర్ల విషయంలో అన్యాయం జరగలేదా అని అడిగితే.. నాగవంశీ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. తాము డిస్ట్రిబ్యూటర్లకు ఒక రేటుకు సినిమాను అమ్ముతామని.. ఆ డిస్ట్రిబ్యూటర్ తన పెట్టుబడిని వెనక్కి తెచ్చుకోవడానికి ఏం చేయాలో అది చేస్తాడని, వీలైనన్ని ఎక్కువ థియేటర్లు క్యాప్చర్ చేయాలనుకుంటాడని.. ఆ టైంలో తాము జోక్యం చేసుకుని, ఇలా చేయడం తప్పు అనలేమని, అది తమ చేతుల్లో లేని విషయమని నాగవంశీ అన్నాడు. తాము ఇంకో సినిమాను తొక్కేయాలని చూడడం లాంటిది ఏమీ జరగలేదని, ఎప్పుడూ అలా చేయమని నాగవంశీ స్పష్టం చేశాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates