2026 ఆరు నెలలు గడిచిపోయాయి. టాలీవుడ్ వరకు చూసుంటే కనీసం సూపర్ హిట్లని చెప్పుకునేవి పది సినిమాలు లేకపోవడం కొంత లోటే అయినప్పటికీ రాబోయే కాలంలో క్యూ కట్టిన రిలీజులు, ప్యాన్ ఇండియా మూవీస్ కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. ముందు జూలైనే తీసుకుంటే ఒకరిద్దరు కాదు ఏకంగా సక్సెస్ ఆవసరమైన ఎనిమిది హీరోలకు పరీక్ష వేదిక కానుంది. విచిత్రంగా అందరూ తమను తాము బలంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరంతో థియేటర్లలో అడుగు పెడుతున్నారు.
ముందుగా సత్యదేవ్ ‘రావు బహదూర్’ మీద మహేష్ బాబు పెట్టుబడి పెట్టడం జనాల్లో ఆసక్తి పెంచింది. సామాన్య ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్లు ఫిక్స్ చేసుకోవచ్చు. రెండో చిత్రమే అయినప్పటికీ విరాట్ కర్ణ మీద వంద కోట్ల పెట్టుబడితో ‘నాగబంధం’ తీయడం పట్ల ఇండస్ట్రీ వర్గాలే ఆశ్చర్యపోయాయి. విఎఫ్ఎక్స్ కు తగ్గ కథా కథనాలు ఉంటే కనక అద్భుతాలు చేయొచ్చు. ఇక అఖిల్ ‘లెనిన్’ మీద అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ సైతం ఎంతో నమ్మకంతో ఉన్నారు.
జూన్ మూడో వారం తిరువీర్ ‘ఓ సుకుమారి’తో వస్తున్నాడు. ఈసారి ఐశ్వర్య రాజేష్ తనకు తోడుగా నిలిచింది. వెరైటీ కాన్సెప్ట్స్ ట్రై చేస్తున్నా విజయం మాత్రం అతనికి అందని ద్రాక్ష పండుగా మిగిలిపోయింది. విశాల్ ‘మకుటం’ పెద్ద బడ్జెట్ తో రూపొందింది. ఇందులో స్వీయ దర్శకత్వంతో పాటు డ్యూయల్ రోల్ చేయడం విశేషం. నిర్మాత ఆర్బి చౌదరి మరణానికి ముందు ఓకే చేసిన సినిమా ఇది. ఆ తర్వాత నాలుగో వారం కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవర్ స్టోరీ’ దిగుతోంది.
సక్సెస్ పరంగా కిరణ్ కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ ఇంకాస్త బలంగా స్థిరపడేందుకు సాలిడ్ బ్లాక్ బస్టర్ పడాలి. కె ర్యాంప్, కలు కొంత వరకే దాన్ని నెరవేర్చాయి. అందుకే చెన్నై లవ్ స్టోరీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. సందీప్ కిషన్ ‘సిగ్మా’ ఎలాంటి వండర్ చేస్తుందో చూడాలి. తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జేసన్ దర్శకుడిగా పరిచయమవుతున్న మూవీ ఇది. ఘట్టమనేని మూడో తరం వారసుడు జయకృష్ణ డెబ్యూ ‘శ్రీనివాస మంగాపురం’ కనక హిట్ అయితే తొలి అడుగు దిగ్విజయంగా పడుతుంది. ఈ రకంగా మొత్తం ఎనిమిది హీరోల బాధ్యతను జూలై మాసం తన భుజాల మీద మోస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates