త్రిశంకు స్వర్గంలో ‘ప్యారడైజ్’ తేదీలు

ఇంగ్లీష్ పదం ప్యారడైజ్ కు తెలుగు అర్థం స్వర్గం. నిజంగానే ఇప్పుడీ సినిమా రిలీజ్ డేట్లు త్రిశంకు స్వర్గంలో ఊగుతున్నాయి. ముందు మార్చి నెలాఖరు అనుకున్నారు. తర్వాత ఆగస్ట్ 21 అని పక్కా నమ్మకంతో పబ్లిసిటీ చేస్తూ వచ్చారు. కానీ అవ్వలేదు. దీంతో రవితేజ ఇరుముడి వెంటనే అలెర్ట్ అయిపోయి ఆ తేదీని తీసేసుకుంది. నిన్నటిదాకా సెప్టెంబర్ 25 అనే కొత్త ప్రచారం వాడుకలో ఉంటూ వచ్చింది. ఇప్పుడు అది కూడా అనుమానమేనని ఇన్ సైడ్ టాక్..

ప్యారడైజ్ ఇంకో నెలన్నరకు పైగా వర్కింగ్ డేస్ అవసరమైన షూటింగ్ ఉందట. సెలవులు, ఏవైనా అనుకోని అడ్డంకులు అన్నీ కలుపుకుని అటుఇటుగా రెండు నెలలు అవసరం పడొచ్చు. ఇది నిజమైన పక్షంలో సెప్టెంబర్ లో రావడం అసాధ్యం. అక్టోబర్ లో అతి కష్టం మీద ట్రై చేయొచ్చు. కానీ ఆ నెలాఖరులో రామాయణ వచ్చే అవకాశం ఉంది. సో ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ లో పెద్ద దెబ్బ పడుతుంది. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ నవంబర్ లో పెద్దగా పనవ్వదు.

మిగిలింది డిసెంబర్. కానీ ఆ నెలలో ప్రభాస్ ఫౌజీ, బాలయ్య 111 లాంటివి వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం. లాస్ట్ వీక్ లో షారుఖ్ ఖాన్ కింగ్ ఉంది. ఇవన్నీ చూసుకుంటే అసలు ప్యారడైజ్ ఎప్పుడు రావాలనేది పెద్ద సందిగ్ధంగా మారిపోయింది. సంక్రాంతి ఆప్షన్ పెట్టుకోలేరు. ఎందుకంటే ఇలాంటి వయొలెంట్ డ్రామాకు ఆ సీజన్ కరెక్ట్ కాదు. అందుకే గతంలో సలార్ ని క్రిస్మస్ కి రిలీజ్ చేశారు తప్పించి జనవరి ఆప్షన్ పెట్టుకోలేదు. సోలోగా వసూళ్లు లాగేసింది.

ఈ లెక్కన ప్యారడైజ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనే దాని మీద ఫ్యాన్స్ విపరీతంగా ఎదురు చూస్తున్నారు. డెసిషన్ ఏదైనా వచ్చే నెల మాత్రం రెండో లిరికల్ సాంగ్ వదలాలని ఫిక్స్ అయ్యారట. కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు, రాఘవ్ జుయెల్ విలన్లుగా నటిస్తుండగా సంపూర్ణేష్ బాబు కామెడీ కాకుండా చాలా సీరియస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయా షేర్ సెన్సేషన్ అయిపోయాక తర్వాత అనిరుద్ రవిచందర్ నుంచి ఎలాంటి పాట వస్తుందోనని మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు.