గొప్ప గొప్ప దర్శకులు కూడా తమ సినిమాలు ఆశించినంత ఆడకపోతే.. వాటి ఫలితాల విషయంలో చిత్రమైన కారణాలు చెబుతుంటారు. స్క్రిప్టు సరిగా లేదని.. సినిమా బాగా తీయలేదని అంగీకరించకుండా.. సాకులు వెతుకుతుంటారు. వైఫల్యాన్ని ఇంకెవరి మీదో నెట్టేయడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. ‘అజ్ఞాతవాసి’ ఎందుకు ఫెయిలైందంటే.. అది పేపర్లో బిజినెస్ పేజీ లాంటిదని, ప్రేక్షకులు అర్థం చేసుకోలేకపోయారని.. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గ సంగీతం ఇవ్వలేదని విడ్డూరమైన కారణాలు చెప్పాడు త్రివిక్రమ్ అప్పట్లో.
ఇక బాలీవుడ్లో ‘పఠాన్’ సహా కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన సిద్దార్థ్ ఆనంద్ ‘ఫైటర్’ ఫెయిల్యూర్ విషయంలో ఇలాంటి రీజన్సే చెప్పాడు. మన ప్రేక్షకుల్లో ఎక్కువమంది విమాన ప్రయాణాలు చేయరని.. అందుకే ఈ ఎయిర్ యాక్షన్ థ్రిల్లర్ వారికి కనెక్ట్ కాలేదని అన్నాడు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న రాజ్ కుమార్ హిరాని సైతం తన ఫెయిల్యూర్ మూవీ ‘డంకి’ విషయంలో ఇలాంటి కారణమే చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
‘డంకి’ సినిమాలో వీసా పొందడానికి డబ్బుల్లేక అక్రమ మార్గాల్లో విదేశాలకు చేరే వారి కష్టాలను చూపించానని.. అలాంటి పరిస్థితులను ఎక్కువమంది ఎదుర్కోరు కాబట్టి ప్రేక్షకులకు ఆ సినిమా కనెక్ట్ కాలేదని ఆయనన్నారు. ఇండియా నుంచి విదేశాలకు వెళ్లాలనుకునే చాలామందికి సులువుగానే వీసా దొరుకుతుందని.. వెళ్లని వాళ్లు వెళ్లరని.. కానీ ఇలా దొంగతనంగా విదేశాలకు వెళ్లేవాళ్లు తక్కువమంది ఉంటారు కాబట్టి వారి కథ సామాన్య ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని ఆయనన్నారు.
కానీ ఇందులో ఏమాత్రం లాజిక్ లేదన్నది వాస్తవం. తెరపై చూసే పాత్రలు, కథలు రిలేటబుల్‌గా ఉంటే మంచిదే కానీ.. అలా లేనంత మాత్రం, మనకు ఎదురు కాని అనుభవాలను చూపించినంత మాత్రాన ఆడియన్స్ వాటికి కనెక్ట్ కారనేదేమీ లేదు. అలా అనుకుంటే ‘దురంధర్’లో చూపించిన ఏ విషయం సామాన్య ప్రేక్షకులకు రిలేటబుల్‌గా ఉంటుంది.
అందులోని విషయాలను ఎవరు ఎక్స్‌పీరియెన్స్ చేసి ఉంటారు. మనకు తెలిసిన కథ అయినా, తెలియని కథ అయినా.. ఎంత ఆసక్తికరంగా, కొత్తగా చెప్పారు అన్నదే కీలకం. ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తే సినిమా హిట్టవుతుంది. లేదంటే లేదు. అంతే తప్ప మనకు అనుభవమైన విషయాలతో సినిమాలు తీస్తేనే ఆడతాయంటే సినీ రంగం ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates