స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్‌కు మంచి గుర్తింపే ఉంది. మణిరత్నం దర్శకత్వంలో నటించిన కల్ట్ మూవీ ‘దొంగా దొంగా’ చూస్తే ఆయన ఎంత మంచి నటుడో అర్థమవుతుంది. రెండు భాషల్లో మరెన్నో పేరున్న చిత్రాల్లో హీరోగానే కాక క్యారెక్టర్ రోల్స్ చేశారు ఆనంద్. ఇటీవలే రిలీజై బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తున్న సమంత సినిమా ‘మా ఇంటి బంగారం’లోనూ
ఆయన ఆమె మామగా ముఖ్య పాత్ర పోషించారు.
ఈ నటుడికి టాలీవుడ్ యువ దర్శకుడు వెంకటేష్ మహా రూపొందించిన ‘కేరాఫ్ కంచరపాలెం’ చూసి మతి పోయిందట. ఇన్నేళ్ల సినీ జీవితంలో తాను చూసిన అత్యుత్తమ చిత్రాల్లో ఇదొకటని.. ఈ సినిమా చివర్లో తనకు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేనని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆనంద్.
‘కేరాఫ్ కంచరపాలెం’ చూసి తాను ఎంత ఎగ్జైట్ అయ్యానో ఆయన వివరించారు. ఎవరో మంచి సినిమా అని చెప్పడంతో తాను టీవీలో కొన్నేళ్ల ముందు ‘కేరాఫ్ కంచరపాలెం’ చూసినట్లు ఆనంద్ తెలిపారు. ఈ సినిమాలో మనం చూసే వేర్వేరు ప్రేమకథలు ఒక్కరివే అని చివర్లో రివీల్ చేసినపుడు తనకు మతి పోయిందని ఆయనన్నారు. ఆ సీన్ చూసి.. ఇదేం ట్విస్టురా బాబూ అనుకుంటూ చేతిలో ఉన్న రిమోట్‌ను విసిరి కొట్టినట్లు ఆయన తెలిపారు.
తర్వాత రిమోట్ రెండు భాగాలను, రెండు బ్యాటరీలను కలిపి పెడుతుంటే.. ఈ సినిమాలో నాలుగు పాత్రలను కలిపి ఒకటి చేస్తున్న ఫీలింగ్ కలిగిందన్నారాయన. సినిమా చూసి ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో బాల్కనీలోకి వెళ్లి ఆలోచిస్తుంటే.. ఒక మూవీకి ఇంత ఎగ్జైట్ అవుతున్నారేంటి అని తన భార్య అడిగిందని, ఇక్కడి నుంచి వెళ్లు అంటూ ఆమెను అరిచానని ఆనంద్ వెల్లడించారు.
ఒకప్పుడు మణిరత్నం దర్శకత్వంలో నటించాలని కలలు కన్నానని.. ఆ తర్వాత తాను ఒక దర్శకుడి సినిమాలో కచ్చితంగా చేయాలి అని ఆశపడింది వెంకటేష్ మహా విషయంలోనే అని ఆనంద్ తెలిపారు. ఒక ఫ్రెండు నుంచి వెంకటేష్ నంబర్ తీసుకుని తనకు కాల్ చేస్తే.. ఫోన్ తీయలేదన్నారాయన. కానీ తాను వెంకటేష్ మహా ఫొటో ప్రింట్ తీసుకుని తన బెడ్ రూంలో అతికించుకున్నట్లు చెప్పి ఆశ్చర్యపరిచారు ఆనంద్. ఐతే కొన్నేళ్ల తర్వాత వెంకటేష్ నుంచే తనకు కాల్ వచ్చిందని.. ‘రావు బహదూర్’లో తనకో కీలక పాత్ర ఇచ్చాడని.. ఆ సినిమా స్క్రిప్టు విని తనకు మతిపోయిందని చెప్పారు ఆనంద్.
Gulte Telugu Telugu Political and Movie News Updates