పెద్దికి రెచ్చిపోయి ఇప్పుడు దొరికిపోయారు

సినిమా ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ గొడవ ఎప్పటినుంచో నడుస్తున్నదే. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా, అక్కడి జనాలు సౌత్ సినిమాలపై చూపిస్తున్న డబుల్ స్టాండర్డ్స్ ఇప్పుడు మరోసారి బయటపడ్డాయి. సౌత్ చిత్రాల్లో గ్లామర్ సీన్లు కాస్త ఎక్కువైతే చాలు మహిళలను కించపరుస్తున్నారంటూ నీతులు చెప్పే నార్త్ విమర్శకులు.. అదే వారి సినిమాల్లో ఎంత బోల్డ్ గా కనిపించినా దాన్ని ట్రెండ్ అని కవర్ చేస్తుంటారు. సరిగ్గా ఇప్పుడు ఇదే పాయింట్ మీద టాలీవుడ్ ఫ్యాన్స్ బాలీవుడ్ మీడియాను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.

ఇటీవల రామ్ చరణ్ పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ మీద ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. ఆ సినిమాలో జాన్వీని కేవలం గ్లామర్ కోసమే వాడుకున్నారని, కొన్ని సీన్లలో ఆమెను బాగా ఆబ్జెక్టిఫై చేశారంటూ బాలీవుడ్ క్రిటిక్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. దీంతో డైరెక్టర్ బుచ్చిబాబు అందరికీ సారీ చెప్పడమే కాకుండా ఆ సీన్లను కూడా మార్చేయాల్సి వచ్చింది.

సరిగ్గా అప్పుడు సౌత్ సినిమాపై అంతలా రెచ్చిపోయిన బాలీవుడ్ మీడియా ఇప్పుడు అడ్డంగా బుక్కయింది. జూన్ 19న రిలీజైన కాక్టెయిల్ 2 సినిమాలో కృతి సనన్ క్యారెక్టర్ ను చూపించిన విధానం మీద ఆ నార్త్ గ్యాంగ్ మొత్తం సైలెంట్ అయిపోయింది. షాహిద్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో ఇటలీ బీచ్ లో కృతి సనన్ పై తీసిన బికినీ సీన్లు, ఆ కెమెరా యాంగిల్స్ చూస్తే కావాలనే ఆబ్జెక్టిఫై చేసినట్లు ఆడియన్స్ ఓపెన్ గానే చెబుతున్నారు.

సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చినా సరే, కేవలం గ్లామర్ ను మాత్రమే నమ్ముకుని ఈ సినిమా తీశారని రివ్యూలు వస్తున్నాయి. అదే సౌత్ సినిమాలో ఇలాంటి సీన్స్ ఉంటే ఈపాటికి గగ్గోలు పెట్టే మెయిన్ స్ట్రీమ్ బాలీవుడ్ మీడియా.. ఇప్పుడు కాక్టెయిల్ 2 విషయంలో మాత్రం ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదు.

వాళ్ళ ఇమేజ్ పెంచుకోవడానికి కావాలనే టాలీవుడ్ సినిమాలపై బురద జల్లుతున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. బాలీవుడ్ సినిమాలో అంతకన్నా దారుణమైన సీన్స్ ఉంటే ఎందుకు అడగడం లేదని క్రిటిక్స్ కు గట్టిగానే క్లాస్ పీకుతున్నారు. ఇదంతా చూస్తుంటే నార్త్ మీడియా డబుల్ గేమ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థమవుతోందని సినీ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.