ముంబ‌యిలో డ్ర‌గ్స్‌తో దొరికిపోయిన టాలీవుడ్ న‌టి


బాలీవుడ్లో డ్ర‌గ్ రాకెట్ గురించి కొన్ని నెల‌లుగా ఎంత చ‌ర్చ జ‌రిగిందో తెలిసిందే. కాగా ఇప్పుడు ఆ సిటీలో మ‌రోసారి మాద‌క ద్ర‌వ్యాల గురించి చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ముంబ‌యిలోని మీరా రోడ్డులో ఉన్న ఓ హోటల్‌పై దాడులు నిర్వహించి అక్క‌డ డ్ర‌గ్ రాకెట్ ముఠా గుట్టు ర‌ట్టు చేశారు. ప‌క్కా స‌మాచారంతో అక్క‌డికి చేరుకున్న అధికారులు.. పెద్ద మొత్తంలో డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఒక టాలీవుడ్ న‌టి డ్ర‌గ్స్‌తో పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన‌ట్లు అక్క‌డి మీడియా వెల్ల‌డించింది. ఆమెతో పాటు చాంద్ అనే వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు.

సదరు నటి నుంచి 400గ్రాముల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీరికి డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసిన సాయిద్ అనే వ్య‌క్తి పరారీలో ఉన్నాడు. ప‌ట్టుబ‌డ్డ‌ డ్రగ్స్ విలువ రూ.10లక్షలు ఉంటుందని తెలుస్తోంది. గ‌త ఏడాది నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణానంత‌రం బాలీవుడ్లో డ్ర‌గ్ రాకెట్ మీద ఎన్సీబీ అధికారులు దృష్టిసారించారు.

సుశాంత్ ప్రేయ‌సి రియా చ‌క్ర‌వ‌ర్తి, ఆమె సోద‌రుల‌తో పాటు దీపికా పదుకొనే, సారా అలీఖాన్‌, రకుల్ ప్రీత్‌సింగ్ త‌దిత‌రుల‌ను అధికారులు విచారించిన విషయం తెలిసిందే. కొంత విరామం త‌ర్వాత ఈ మ‌ధ్య మ‌ళ్లీ కొంద‌రు బాలీవుడ్ న‌టుల‌ను విచార‌ణ‌కు పిలిచారు. ఇలాంటి స‌మ‌యంలో ముంబ‌యి డ్ర‌గ్స్‌తో ఓ టాలీవుడ్ న‌టి ప‌ట్టుబ‌డ‌టం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఆ న‌టి ఎవ‌ర‌న్న వివ‌రాలు బ‌య‌టికి రాలేదు.