కమల్ హాసన్ అభిమానులే మర్చిపోయిన పేరు ఇండియన్. మొన్న ఏడాది దీని రెండో భాగం వచ్చి ఎంత డిజాస్టర్ అయ్యిందో అంత సులభంగా మర్చిపోలేం. ముఖ్యంగా పాతికేళ్ల చరిత్ర ఉన్న ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ పేరుని స్వయంగా దర్శకుడు శంకర్ చెడగొట్టుకోవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. ఫ్లాప్ అయితే అయ్యింది కానీ ట్రోలింగ్ కు గురయ్యే స్థాయిలో లోకనాయకుడికి డ్యామేజ్ చేయడం ఎవరూ ఊహించలేదు. అక్కడితో దాని కథ ముగిసిపోయినా బాగుండేది.
ఇంకా ఇండియన్ 3 పెండింగ్ ఉంది. దాదాపు షూటింగ్ మొత్తం సీక్వెల్ తో పాటుగా సమాంతరంగా చేశారు. ఇంకొంత భాగం మాత్రమే బ్యాలన్స్ ఉంది. అయితే పూర్తి చేయడానికి శంకర్, డేట్స్ ఇవ్వడానికి కమల్ సుముఖంగా లేరనే వార్త చెన్నై వర్గాల్లో ముందు నుంచి వినిపిస్తోంది. అసలు ఇబ్బంది అది కాదు. ఈ ప్రాజెక్టు మీద ఇంకొక్క రూపాయి అదనంగా ఖర్చు పెట్టేందుకు లైకా ప్రొడక్షన్స్ సిద్ధంగా లేకపోవడమే ప్రధాన సమస్యని మరో వర్గం అంటోంది.
ఇదంతా జరిగి నెలలు గడిచిపోయాయి. తాజాగా మరోసారి ఇండియన్ 3 టాపిక్ తెరమీదకు వస్తోంది. ఎలాగైనా పూర్తి చేసి థియేటర్లలోనో లేదా ఓటిటిలోనో రిలీజ్ చేయాలనే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయట. నిజానికి అసలు కథంతా ఉన్నది మూడో భాగంలోనే. సేనాపతి స్వాతంత్ర పోరాటంలో ఇంకా ఏమేం చేశాడనే దాని మీద మంచి యాక్షన్ మెటీరియల్ తీశారు శంకర్. ట్రైలర్ లో వాటిని చూసిన ప్రేక్షకులకు రెండో భాగంలో ఎంత మోసపోయామో అర్థం చేసుకున్నారు.
ఎలా చూసుకున్నా జీరో అయిపోయిన బజ్ ని తిరిగి పుట్టించడం అంత సులభంగా జరిగే పనిలా కనిపించడం లేదు. బిజినెస్ పరంగా కూడా హైప్ లేదు. సగటు జనాలకు ఆసక్తి లేదు. ఇలాంటి టైంలో మళ్ళీ ఇండియన్ 3 చర్చలోకి రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. ఒకవేళ నిజంగా రిలీజ్ చేసే ఉద్దేశం ఉంటే అదేదో చకచకా కానిచ్చేసి ఏదో ఒక రూపంలో బయటికి వదలడం ఉత్తమం. లేదంటే శాశ్వతంగా ల్యాబ్ లోనే మగ్గిపోయే ప్రమాదముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
