తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో సాగిపోయాడు మాస్ రాజా రవితేజ. మధ్య మధ్యలో చేసిన ప్రయోగాత్మక చిత్రాలు చేదు అనుభవాన్ని మిగిల్చిన నేపథ్యంలో అతను మాస్ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తూ వచ్చాడు. కానీ ఒక దశ దాటాక ఆ మాస్ సినిమాలు కూడా వర్కవుట్ కాని పరిస్థితి వచ్చేసింది.
ముఖ్యంగా ‘మాస్ జాతర’ అనుభవం తర్వాత రవితేజకు రూటు మార్చాల్సిన అవసరం కనిపించింది. దీంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఇరుముడి లాంటి తన ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన సినిమాలను లైన్లో పెట్టాడు. ఇవి కాక రాజ రాజ చోర, శ్వాగ్ చిత్రాల దర్శకుడు హాసిత్ గోలి దర్శకత్వంలో మాస్ రాజా ఒక సినిమాను ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఒక షాకింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది.
హాసిత్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో రవితేజ హిజ్రా పాత్రను చేయబోతున్నాడు.. ఇందులో హీరోయిన్ పాత్ర కూడా ఉండదు అన్నది ఈ వార్త సారాంశం. ఇది ప్రయోగాత్మకంగా, పూర్తి వినోదాత్మకంగా సాగే సినిమా అని అంటున్నారు. ఈ న్యూస్ రవితేజ అభిమానులను షాక్‌కు గురి చేసింది.
టాలీవుడ్ హీరోలు మహిళల వేషధారణతో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. ‘మేడమ్’లో రాజేంద్ర ప్రసాద్, ‘చిత్రం భళారే విచిత్రం’లో నరేష్, ‘లైలా’లో విశ్వక్సేన్ ఇలాంటి పాత్రలే చేశారు. కానీ ఒక మాస్ హీరో హిజ్రా పాత్ర చేయడం మాత్రం ఊహకందని విషయం.
హాసిత్ చివరి చిత్రం ‘శ్వాగ్’లో శ్రీవిష్ణు చేసిన భిన్న పాత్రల్లో హిజ్రా క్యారెక్టర్ కూడా ఒకటి. కానీ రవితేజ.. ఫుల్ లెంత్ హిజ్రా పాత్ర చేస్తాడంటే అభిమానులు జీర్ణించుకోవడం కష్టం. మాస్ రాజా నుంచి మార్పు కోరుకుంటున్న మాట వాస్తవమే కానీ.. మరీ ఇంత మార్పు అంటే ఫ్యాన్స్ తట్టుకోలేరేమో. ఐతే ఈ చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్త నిజం కాదని తెలుస్తోంది.
ఎవరో కావాలని పుకారు పుట్టించారా.. లేక ఈ చిత్రానికి బజ్ క్రియేట్ చేయడానికి టీం నుంచే ఇలాంటి లీక్ ఒకటి వదిలారా అనే సందేహాలు కలుగుతున్నాయి. హాసిత్ స్టయిల్లోనే ఇది భిన్నంగా ఉండే సినిమా అని.. రవితేజ హిజ్రాగా కనిపిస్తాడన్నది మాత్రం వాస్తవం కాకపోవచ్చని సమాచారం. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేయనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
