కమెడియన్‌కు ఇంకా మత్తు వదల్లేదా?

హీరోలుగా మారిన క‌మెడియ‌న్లు టాలీవుడ్లో చాలామంది ఉన్నారు. కానీ ఈ క‌మెడియ‌న్లు త‌మ‌కు సెట్ అయ్యే వినోదాత్మ‌క చిత్రాలు చేసినంత వ‌ర‌కు బాగానే అనిపిస్తుంది. కానీ అలా కాకుండా మాస్ హీరోల్లా మారి సీరియ‌స్‌గా ఫైట్లు, డ్యాన్సులు చేస్తేనే చూడ్డానికి అదోలా ఉంటుంది. సునీల్ స‌హా చాలామంది క‌మెడియ‌న్లు ఇలా గాడి త‌ప్పిన వాళ్లే. స‌ప్త‌గిరి సైతం హీరోగా మారాక మాస్ ఇమేజ్ కోసం త‌పించిపోయాడు.

స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్ ఓ మాదిరిగా ఆడ‌టంతో వ‌రుస‌బెట్టి హీరోగా సినిమాలు చేశాడు. వాటిలో ఫైట్లు, డ్యాన్సుల‌కు ఢోకా లేక‌పోయింది. కానీ ఆ సినిమాలేవీ ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. దీంతో అత‌ను హీరోగా సినిమాలు కూడా ఆగిపోయాయి. స‌ప్త‌గి రి లైమ్ లైట్లో లేకుండా పోయాడు.

ఐతే కొంత విరామం త‌ర్వాత స‌ప్త‌గిరి మ‌ళ్లీ హీరోగా ఓ సినిమాను ప్ర‌క‌టించాడు. ఆ చిత్రం పేరు.. ఎయిట్. దీన్ని తెలుగుతో పాటు త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లోనూ తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. దీన్ని పాన్ ఇండియా సినిమాగా పేర్కొంటున్నారు. రిజ్వాన్ ఎంట‌ర్టైన్మెంట్ బేన‌ర్లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సూర్యాస్ అనే కొత్త వ్య‌క్తి ద‌ర్శ‌కుడు. ఎయిట్ అనే టైటిల్ చూసి ఈ సినిమాపై ఎవ‌రికీ ఒక అంచ‌నా లేక‌పోయింది.

తాను చేసిన మాస్ సినిమాలు తేడా కొట్టిన నేప‌థ్యంలో స‌ప్త‌గిరి ఈ సారి ఏదైనా భిన్నంగా చేస్తాడేమో అనుకున్నారు. కానీ కొత్త సంవ‌త్స‌ర కానుక‌గా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ చూస్తే మ‌ళ్లీ స‌ప్త‌గిరి మాస్ ఇమేజ్ కోసం వెంప‌ర్లాడుతున్న‌ట్లే అనిపిస్తోంది. బ్యాగ్రౌండ్లో ఫైర్, చేతి వేళ్ల‌పై ర‌క్తం, వాటి మ‌ధ్య సిగ‌రెట్.. అలాగే స‌ప్త‌గిరి లుక్స్.. అంతా చూస్తే అత‌ను మ‌ళ్లీ మాస్ సినిమానే చేయ‌బోతున్నాడ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇది చూసి క‌మెడియ‌న్ల‌కు ఈ మాస్ మ‌త్తు ఎప్ప‌టికి వ‌దులుతుందో అని కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌న్లు.