సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా పెద్దిలో జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేనిది ఒక పెద్ద హీరో సినిమా విడుదలైన మూడో రోజు దర్శకుడు దాని గురించి క్షమాపణ చెబుతూ మార్పులు చేశామని ప్రకటించడం ఈ మధ్య కాలంలో జరగలేదని చెప్పాలి. ఇది మెచ్చుకోవాల్సిన విషయమే అయినా ఒక గొప్ప క్రీడాకారుడు కథను చెబుతున్నప్పుడు హీరోయిన్ ట్రాక్ ని ఇలా ఎలా రాసుకుంటారనే కామెంట్స్ ఇంటా బయటా బలంగా వినిపిస్తున్నాయి.
ఇక్కడ కొంచెం వెనక్కు వెళ్ళాలి. బుచ్చిబాబు మొదటి సినిమా ఉప్పెనలో కృతి శెట్టి ఎంత ప్లస్ అయ్యిందో ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. వెతికి మరీ ఆ టీనేజ్ అమ్మాయిని తీసుకొచ్చి ఆమెతో మంచి పెర్ఫార్మన్స్ రాబట్టుకుకోవడంతో పాటు అందం, అభినయం రెండూ చూపించిన బుచ్చిబాబు అందుకే అంత పెద్ద హిట్టు కొట్టగలిగారు. కంటెంట్ లో ఉన్న నిజాయితీ గుర్తించడం వల్లే జాతీయ అవార్డుకు అర్హమైందిగా కమిటీ పెద్దలు ఆ గౌరవం ఇచ్చి పురస్కరించారు.
ఏ అంశాన్ని తనకు బలంగా బుచ్చిబాబు ఉప్పెనలో వాడుకున్నారో ఇప్పుడదే బలహీనతగా మారిపోయింది. అయినా జాన్వీ కపూర్ ఉన్నంత మాత్రాన మాస్ కోసం ఆమెను కేవలం ఆ కోణంలోనే చూపించాల్సిన అవసరం లేదు. తను మంచి ఆర్టిస్టు. సెకండాఫ్ లో పెద్ది కోసం తండ్రిని ఎదిరించే సీన్ లో గమనించవచ్చు. అలా కాకుండా పెద్ది ఏం చేసినా ఒప్పుకోవడం, అతని వెంట పడటం లాంటివి సబ్జెక్టులోని ఔచిత్యాన్ని తగ్గించేశాయి. అందుకే ఇంత నెగటివిటీ.
ఇదంతా స్క్రిప్ట్ దశలోనే చూసుకోవాల్సిన పొరపాట్లు. ఒక్కోసారి పెద్ద మూల్యం చెల్లించేలా చేస్తాయి. ఇప్పుడీ టాపిక్ గురించి ఒక్కొక్క మహిళా సెలబ్రిటీలు గళం విప్పుతున్నారు. కొందరు పాజిటివ్ గా మరికొందరు నెగటివ్ గా అన్ని రకాల రియాక్షన్లు కనిపిస్తున్నాయి. స్టోరీ, రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ గురించి కాకుండా ఇలా హీరోయిన్ కేంద్ర బిందువుగా చర్చ జరగడం విచారకరం. జాన్వీ కూడా గిల్టీగా ఫీలయ్యిందని ముంబై మీడియాలో కథనాలు వస్తున్నాయి. లోగుట్టు పెరుమాళ్ళకెరుక.
Gulte Telugu Telugu Political and Movie News Updates