మృణాల్ టేస్ట్ మీద అనుమానాలు

డెకాయిట్ విడుదల సమయంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఒక పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చింది. కథల విషయంలో తను చాలా జాగ్రత్తగా ఉంటానని, పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న కంటెంట్ నే ఎంచుకుంటానని నొక్కి మరీ చెప్పింది. అడివి శేష్ మాట్లాడుతూ ఆమెను ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని, ఎస్ చెప్పడమే తమ అదృష్టంగా భావించామని సపోర్ట్ చేశాడు. సరే డెకాయిట్ ఓ మోస్తరుగా ఆడేసి వెళ్ళిపోయింది సంతోషం. ఇక్కడిదాకా బాగానే ఉంది కదా.

కానీ అదేంటో టాలీవుడ్ విషయంలో రకరకాల రూల్స్ చెప్పే మృణాల్ ఠాకూర్ అక్కడ బాలీవుడ్ లో మాత్రం బి గ్రేడ్ అనిపించే కామెడీ సినిమాలు ఒప్పుకుంటూ వరస డిజాస్టర్లను ఖాతాలో వేసుకుంటోంది. తాజాగా వరుణ్ ధావన్ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ రిలీజయ్యింది. హీరో తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ లో మృణాల్ తో పాటు పూజా హెగ్డే మరో కథానాయిక. ప్రమోషన్లు గట్రా జోరుగా చేసి మొదటి రోజే వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ ఇచ్చారు.

ఇంతా చేసిన హై జవానీ తో ఇష్క్ హోనా హై 90 కాలం నాటి అవుట్ డేటెడ్ కామెడీతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేసింది. పెళ్ళైన హీరో ఆమెతో విభేదాల కారణంగా విడిపోయి విదేశాల్లో ఇంకో అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య నలిగిపోయి మనకూ నరకం చూపిస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇందులో ఇంతకన్నా కథ లేదు. పాత చింతకాయ పచ్చడి జోకులతో దేనికి నవ్వాలో అర్థం చేసుకునే లోపే క్లైమాక్స్ వచ్చేసి థియేటర్ బయటికొచ్చాక హమ్మయ్య అనిపిస్తుంది.

ఇందులో మృణాల్ చేసింది పరమ రొటీన్ పాత్ర. కేవలం పారితోషికం కోసం చేసి ఉంటే ఏం చెప్పలేం కానీ ఇదేదో కెరీర్ కు ఉపయోగపడుతుందనో లేదా ఆడి తీరుతుందనే నమ్మకంతో నటించినది మాత్రం కాకపోవచ్చు. ఇదే కాదు మృణాల్ గత సినిమా దో దివానే షెహర్ మే, సన్ అఫ్ సర్దార్ 2, పిప్ప, ఆంఖ్ మిచోళి అన్నీ ఫ్లాపే. ఒక్క ఫ్యామిలీ స్టార్ మినహాయించి తెలుగులో మాత్రమే కాసిన్ని సక్సెస్ లు ఉన్నాయి. నెక్స్ట్ పూజా మేరీ జాన్ రాబోతోంది. అదెలా ఉంటుందో మరి.