పెద్ది గాడికి ఈమాత్రం పుష్ చాలు

ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడు.. అది కూడా కొత్త వాళ్లతో ఒక ప్రేమకథ చేసిన వాడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేస్తున్నాడంటే ఈ ప్రాజెక్టును ఏమాత్రం డీల్ చేయగలడో అని మెగా అభిమానుల్లో సందేహాలు కలిగిన మాట వాస్తవం. మరోవైపేమో చరణ్ ‘ఆచార్య’, ‘గేమ్ చేంజర్’ లాంటి డిజాస్టర్ల తర్వాత ఈ సినిమా చేశాడు. దీంతో ‘పెద్ది’ మీద మొదట్లో మరీ అంచనాలేమీ లేవు. కానీ అదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా బంపర్ క్రేజ్ తెచ్చుకుంది.

ఇక రిలీజ్ టైంకి ఈ సినిమాకు పరిస్థితులు భలేగా కలిసొచ్చాయి. సంక్రాంతి తర్వాత సరైన పెద్ద సినిమా లేకపోవడం.. పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పెద్దగా ప్రభావం చూపకపోవడం.. సమ్మర్లో ఇంకే పెద్ద సినిమా రిలీజ్ కాకపోవడంతో మొత్తం ఇండస్ట్రీ దృష్టి ఈ చిత్రం మీదే నిలిచింది. ఆడియన్స్ కూడా ఒక పెద్ద సినిమా చూసేందుకు ఆవురావురుమని ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఒక మంచి సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి.

ఇలాంటి టైంలో రిలీజ్ కావడం ‘పెద్ది’కి అతి పెద్ద ప్లస్. ఈ నేపథ్యంలో సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే చాలు.. బాక్సాఫీస్ విధ్వంసం ఖాయమని ట్రేడ్ పండిట్లు ముందే అంచనా వేశారు. ‘పెద్ది’ పర్ఫెక్ట్ సినిమా అని.. అద్భుతంగా ఉందని చెప్పలేం కానీ.. సినిమాకు ఎక్కడా నెగెటివ్ టాక్ అయితే లేదు.

కొన్ని విషయాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నా.. దీన్ని మంచి సినిమా అనే అంటున్నారు మెజారిటీ ప్రేక్షకులు. ఈ మాత్రం పాజిటివ్ టాక్ వస్తే ఇలాంటి క్రేజీ మూవీకి ఇంకేం కావాలి? దీంతో పెయిడ్ ప్రిమియర్స్ నుంచే ‘పెద్ది’ విధ్వంసం మొదలైపోయింది.

తెలుగులో హైయెస్ట్ పెయిడ్ ప్రిమియర్స్ రికార్డును ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం… తొలి రోజు కూడా చాలా చోట్ల ఆల్ టైం రికార్డులు నెలకొల్పే దిశగా అడుగులు వేస్తోంది. వీకెండ్ రికార్డుల్లో కూడా కొన్ని ఖాతాలో చేరితే ఆశ్చర్యం లేదు.

ఆదివారం సెకండ్ షోలు అయ్యేసరికే సినిమా చాలా వరకు బయ్యర్ల పెట్టుబడిని వెనక్కి తెస్తుందనే అంచనాలున్నాయి. అంతిమంగా చూస్తే సూపర్ హిట్ టాక్ రాకపోయినా ‘పెద్ది’ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలలో ఒకటిగా నిలిస్తే ఆశ్చర్యం లేదు.