కన్నడ సీనియర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కొన్నేళ్ల క్రితం వరకు మన ప్రేక్షకులకు అంతగా సుపరిచితం కాదు. జైలర్ 2లో ఎప్పుడైతే నరసింహ క్యారెక్టర్ పేలిందో అప్పటి నుంచి ఇక్కడా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అంతకు ముందే బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణిలో అతిథి పాత్ర చేసిన సంగతి జనాలకు అంతగా రిజిస్టర్ కాలేదు. కారణం బుర్రకథ పాడే ఒక పాటలో నటించడం వల్ల. ఇప్పుడు పెద్దిలో శివన్న వేసిన గౌర్ నాయుడు పాత్రకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
ప్రీ ఇంటర్వెల్ కు కాసేపు ముందు ఎంట్రీ ఇచ్చే శివరాజ్ కుమార్ కు అభిమానులు ఊహించిన దానికన్నా ఎక్కువ స్పేస్ దొరికింది. దీన్ని దర్శకుడు బుచ్చిబాబు మలచిన తీరుకి కన్నడ మీడియా నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. రామ్ చరణ్ కు కఠినమైన పరీక్షలు పెట్టడం, తన కాళ్ళు పట్టుకున్నా సరే చలించకుండా మల్లయోధులను పెద్ది మీదకు పంపించడం లాంటి సీన్లలో ఆయన పెద్దరికం, నటన రెండూ హుందాగా కుదిరాయి. చిన్న కుస్తీ ఫైట్ కూడా చేశారు.
క్యాస్టింగ్ విషయంలో బుచ్చిబాబు ఎత్తుగడని మెచ్చుకోవాలి. ఎందుకంటే శివరాజ్ కుమార్ ఉండటం కర్ణాటకలో చాలా ప్లస్ అవుతోంది. ఎలా అంటే మాములుగా తెలుగు సినిమాలకు ఎక్కువ ఆదరణ ఉండేది బెంగళూరు, బళ్లారి, రాయచూర్ లాంటి కొన్ని నగరాలు, పట్టణాల్లో మాత్రమే. కింది సెంటర్లలో మన సినిమాలు ఆడాలంటే శాండల్ వుడ్ ఆర్టిస్టులు ఉండాలి. ఇప్పుడీ గౌర్ నాయుడు పుణ్యమాని టాక్ వెళ్ళిపోయి జనాలు డబ్బింగ్ వెర్షన్ చూసేలా చేస్తున్నాయి.
ఈ పాత్రను శివన్న ఎంతగా ప్రేమించాడనేది షూటింగ్ కు ముందే ఇచ్చిన ఇంటర్వ్యూలలో చూడొచ్చు. బెంగళూరు ప్రెస్ మీట్ లోనూ దాన్ని బయట పెట్టారు. చెన్నైకి వచ్చి మరీ తన మద్దతు ప్రకటించారు. షూట్ వల్ల విజయవాడకు రాలేకపోయారు కానీ లేదంటే అదీ మిస్ అయ్యేది కాదు. ఇటీవలే ఒక తమిళ సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించేందుకు ఎస్ చెప్పిన శివరాజ్ కుమార్ ఇకపై బాషా భేదాలు పెట్టుకోను అంటున్నారు. లేట్ ఏజ్ లో కూడా ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates