సేతుపతి స్థానంలో రాజశేఖర్?

దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు కూడా సేతుపతి కోసం కొన్ని నెలల పాటు ఎదురు చూశాడు. అతను అందుబాటులోకి రాకపోవడంతో ‘పుష్ప’లో విలన్ పాత్రను ఫాహద్ ఫాజిల్‌తో చేయించాడు. ఇంకా సేతుపతి కోసం అటు తమిళంలో, ఇటు తెలుగులో పాత్రలు రాసి, తన కోసం ఎదురు చూసే దర్శకులు చాలామందే ఉన్నారు.

అతడికి మలయాళం, కన్నడ, హిందీ భాషల నుంచి కూడా ఆఫర్లు వస్తుంటాయి. ఐతే ఎక్కువగా తమిళంలో సినిమాలు చేసే సేతుపతి.. బయటి భాషల చిత్రాల విషయంలో చాలా చూజీగా ఉంటాడు.

‘ఉప్పెన’ తర్వాత తెలుగులో క్యారెక్టర్ రోల్స్ ఒప్పుకోని సేతుపతి.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘స్లమ్ డాగ్’ మూవీలో లీడ్ రోల్ చేశాడు. ఐతే విజయ్ దేవరకొండ క్రేజీ మూవీ ‘రౌడీ జనార్ధన’లో విలన్ పాత్ర కోసం సేతుపతినే అడిగిందట చిత్ర బృందం. దర్శకుడు రవికిరణ్ కోలా.. సేతుపతిని దృష్టిలో ఉంచుకునే ఈ క్యారెక్టర్ రాశాడట.

సినిమాలో మిగతా సన్నివేశాలను చిత్రీకరిస్తూ.. విలన్ పాత్రతో ముడిపడ్డ సీన్లు మాత్రం పక్కన పెట్టి, సేతుపతి కోసం వెయిట్ చేస్తూ వచ్చింది టీం. ఆయన ఓకే అంటే అడిగినంత పారితోషకం ఇవ్వడానికి కూడా నిర్మాత దిల్ రాజు రెడీగా ఉన్నాడు. కానీ సేతుపతి ఎంతకీ అందుబాటులోకి రాలేదట.

దీంతో ఇక లాభం లేదని ఆ పాత్ర కోసం టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్‌ను తీసుకోవాలని భావిస్తోందట టీం. డిసెంబరులో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. ఇంకెంతో కాలం సేతుపతి కోసం ఎదురు చూసే పరిస్థితి లేదు. రాజశేఖర్ ఇటీవలే ‘బైకర్’ చిత్రంలో తండ్రి పాత్రతో ఆకట్టుకున్నారు. ఆ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా రాజశేఖర్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

సేతుపతి చేస్తే బహు భాషల్లో సినిమాకు క్రేజ్ వస్తుందన్న మాట వాస్తవమే. కానీ అతను ఈ పాత్రకు ఎస్ చెప్పకపోవడంతో ఇక రాజశేఖర్‌తో వెళ్లిపోవాలని టీం భావిస్తోందట. విజయ్ ఆల్రెడీ ఈ సినిమా కోసం కొన్ని షెడ్యూళ్లు చిత్రీకరణలో పాల్గొన్నాడు. తర్వాత ‘రణబాలి’ కోసం పని చేసి, మళ్లీ ఇప్పుడు ‘రౌడీ జనార్ధన’ కోసం డేట్లు కేటాయిస్తున్నాడు.