ఇక్క‌డ ప‌వ‌న్… అక్కడ సూర్య‌

ఒక సినిమా పెద్ద హిట్ట‌యితే.. టీంలో ముఖ్య‌మైన వ్య‌క్తుల‌కు నిర్మాత కార్లు ఇచ్చే సంప్ర‌దాయం ఎప్ప‌ట్నుంచో ఉంది. కోలీవుడ్లో సైతం ప‌లు చిత్రాల‌కు ఇలా జ‌రిగింది. కొన్నేళ్ల ముందు జైల‌ర్ సినిమాకు గాను హీరో, ద‌ర్శ‌కుడు, సంగీత ద‌ర్శ‌కుల‌కు స‌న్ పిక్చ‌ర్స్ అధినేత క‌ళానిధి మార‌న్ ల‌గ్జ‌రీ కార్లు ఇవ్వ‌డం గుర్తుండే ఉంటుంది. తెలుగులో చాలామంది నిర్మాత‌లు ఈ బాట‌లో సాగారు.

కానీ ఒక హీరో.. త‌న సినిమా టీంలో ముఖ్యుల‌కు ల‌గ్జ‌రీ కార్లు ఇచ్చిన ఉదంతాలు మాత్రం అరుదు. గ‌త ఏడాది ఓజీ రూపంలో చాలా ఏళ్ల త‌ర్వాత త‌న అభిమానుల‌కు మెచ్చే సినిమానుఅందించిన సుజీత్‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖ‌రీదైన కారు బ‌హుమ‌తిగా ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్పుడు ఇదే బాట‌లో త‌మిళ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన సూర్య త‌న సినిమా టీం స‌భ్యుల‌కు ల‌గ్జ‌రీ కార్లు ఇవ్వ‌డం అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది.

క‌రుప్పు సినిమాతో త‌న కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు సూర్య‌. ఈ చిత్రం ఏకంగా రూ.300 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి, ఇంకా త‌మిళ‌నాట నిల‌క‌డ‌గా సాగిపోతోంది. ఈ ఆనందంలో సూర్య చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు సాయి అభ్యంక‌ర్, సినిమాటోగ్రాఫ‌ర్ జీకే విష్ణు, ఎడిట‌ర్ క‌లైవ‌న‌న్‌ల‌కు ల‌గ్జ‌రీ ఎస్యూవీ కార్లు బ‌హుమ‌తిగా అందించాడు. ఆ కార్ల‌లో ఒక్కోదాని ఖ‌రీదు రూ.30 ల‌క్ష‌ల‌కు పైనేన‌ట‌.

ద‌ర్శ‌కుడు ఆర్జే బాలాజీకి ఇంకా పెద్ద గిఫ్ట్ ఇచ్చే అవ‌కాశాలున్న‌ట్లు చెబుతున్నారు. ఈ గిఫ్ట్‌ల కోసం సూర్య రూ.2 కోట్ల‌కు పైగానే ఖ‌ర్చు పెడుతున్న‌ట్లు స‌మాచారం. క‌రుప్పు సినిమాకు విడుద‌ల ముంగిట ఎంత పెద్ద స‌మ‌స్య ఎదుర్కొందో తెలిసిందే.

నిర్మాత‌ను పాత అప్పులు, ఫైనాన్స్ వివాదాలు చుట్టుముట్ట‌గా.. ఆ స‌మ‌యంలో సూర్య‌నే పెద్ద మొత్తంలో డ‌బ్బుల‌కు పూచీక‌త్తుగా ఉండి సినిమాను రిలీజ్ చేయించాడు. అలా సినిమాను బ‌య‌ట‌ప‌డేసిన సూర్య‌.. ఇప్పుడు క‌రుప్పు పెద్ద హిట్ట‌యిన నేప‌థ్యంలో పెద్ద మ‌న‌సుతో టీం స‌భ్యుల‌కు ఖ‌రీదైన గిఫ్టులు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.