అతణ్ని వదలని సందీప్ వంగ

కొత్త దర్శకులను నమ్మి నిర్మాతలు భారీ బడ్జెట్లు పెట్టడానికి సందేహిస్తారు. ఈ క్రమంలో అరంగేట్ర దర్శకులు చిన్న స్థాయి టెక్నీషియన్లతోనే సర్దుకుపోతుంటారు. ఐతే తమకంటూ మంచి గుర్తింపు వచ్చి, నిర్మాతలు పెద్ద బడ్జెట్లు చేయడానికి ముందుకు వస్తే.. అందుకు తగ్గట్లే పెద్ద టెక్నీషియన్లను తీసుకుంటారు. ముందు సినిమాలకు పని చేసిన చిన్న టెక్నీషియన్లను పట్టించుకునే వాళ్లు తక్కువే.

ఐతే ‘అర్జున్ రెడ్డి’తో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి మాత్రం ఒక టెక్నీషియన్‌ను అలా వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు తాను చేయబోయే భారీ ప్రాజెక్టుకు సైతం అతణ్ని కొనసాగిస్తున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. ‘అర్జున్ రెడ్డి’కి అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్. ఈ చిత్రానికి పాటలు అందించింది రధాన్. ఐతే అతడితో తనకు అస్సలు పడలేదని, తనను బాగా ఇబ్బంది పెట్టాడని సందీప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం తెలిసిందే.

అతడితో వేగలేక హర్షవర్ధన్ రామేశ్వర్‌తో బ్యాగ్రౌండ్ స్కోర్ చేయించుకున్నాడు. ఐతే సినిమాకు అది పెద్ద ప్లస్ అయింది. ‘అర్జున్ రెడ్డి’ బీజీఎం ఇండస్ట్రీలోనే ఒక సెన్సేషన్ అయింది. ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో తీసిన సందీప్.. ఒరిజినల్ స్కోర్‌నే అక్కడా కొనసాగించాలనుకున్నాడు. హర్షవర్ధన్‌ ఆ సినిమాకు కూడా పని చేశాడు. కాగా ఇప్పుడు సందీప్.. రణబీర్ కపూర్‌తో ‘అనిమల్’ అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఒక చిన్న టీజర్ లాంటిది వదిలారు. అందులో రణబీర్ వాయిస్ ఓవర్‌తో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా హైలైట్ అయ్యాయి.

బాలీవుడ్ వాళ్లు ఇలాంటి భారీ చిత్రాలకు అక్కడి పేరున్న సంగీత దర్శకులనే పెట్టుకుంటారు. కానీ సందీప్ పట్టుబట్టి హర్షవర్ధన్‌తో పని చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. టీజర్లో హర్షవర్ధన్ తన ప్రత్యేకతను చాటుకుని.. సినిమాలో తన స్కోర్‌పై అంచనాలు పెంచాడు. ఆ అంచనాల్ని అతను అందుకోగలిగితే బాలీవుడ్లో మంచి అవకాశాలు అందుకోవడానికి ఛాన్సుంది.