ఘట్టమేనేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న జయకృష్ణ మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే టీజర్, ఒక పాట వచ్చేయగా సూపర్ స్టార్ స్వర్గీయ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఒక యాక్షన్ కట్ రిలీజ్ చేశారు. నిన్న జరిగిన ఈవెంట్ లో అశ్వినీదత్, రాఘవేంద్రరావు, కిరణ్, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి సీనియర్ల హాజరులో కుర్రాడిని ఘనంగా ప్రేక్షకులకు పరిచయం చేశారు.
బాబాయ్ మహేష్ బాబు అభిమానుల అండ ఎంత అవసరమో జయకృష్ణ బృందానికి తెలియంది కాదు. తండ్రి రమేష్ బాబు కూడా ఒకప్పుడు హీరోనే అయినప్పటికీ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆయన చనిపోయిన తర్వాత కొడుకు రూపంలో తీరని కలను ఇలా నెరవేరుస్తాడని కుటుంబం బోలెడు ఆశలు పెట్టుకుంది. దానికి తగ్గట్టే జయకృష్ణ లుక్స్ లో మంచి అందంగా కనిపించడమే కాదు నటన పరంగా శిక్షణ తీసుకున్న వైనం విజువల్స్ లో కనిపిస్తోంది.
శ్రీనివాస మంగాపురం దర్శకుడు అజయ్ భూపతి. ఆరెక్స్ 100 తర్వాత మహా సముద్రం నిరాశపరిచిన మంగళవారంతో తిరిగి తన ఉనికిని కొంత మేర చాటుకోగలిగాడు. ఇప్పుడు కీలకమైన జయకృష్ణ డెబ్యూని తన చేతుల్లో పెట్టారు. సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ కూతురు రషా తదాని ఈ మూవీతో టాలీవుడ్ కు పరిచయమవుతోంది. తన తల్లి తెలుగులో బంగారు బుల్లోడు, రథసారధి, ఆకాశవీధిలో లాంటి చెప్పుకోదగ్గ సినిమాలు కొన్ని చేసింది.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇందులో ఒక కీలక పాత్ర పోషించడం మరో విశేషం. జివి ప్రకాష్ కుమార్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. జయకృష్ణ కనక మొదటి సినిమాతో సక్సెస్ అందుకుంటే అవకాశాలు క్యూ కడతాయి. సుధీర్ బాబు విషయంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా కథల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఎలాగూ బాబాయ్ గైడెన్స్ ఉంటుంది కాబట్టి కెరీర్ ని సరైన దిశగా ప్లాన్ చేసుకుంటే చాలు వరసగా సినిమాలు చేసుకోవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates