విశ్వంభర థియేటర్ హక్కులు మైత్రి సంస్థ కొన్నదని నిన్నంతా ప్రచారం జరిగింది. రెండు రోజుల క్రితం ఆర్టిస్టు ప్రవీణ్ తాను డబ్బింగ్ చెబుతున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి త్వరలో రిలీజనే సంకేతం ఇచ్చారు. అంతకు ముందు దర్శకుడు వసిష్ఠ, కెమెరామెన్ చోటా కె నాయుడు, నిర్మాత వంశీ కలిసి ఉన్న పిక్ ఒకటి వదిలి ట్రైలర్ సిద్దమనే సిగ్నల్స్ కొందరు ఫ్యాన్స్ ద్వారా ఇచ్చారు. ఇంత జరుగుతున్నా యువి క్రియేషన్స్ నుంచి కానీ చిరంజీవి నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడమే ట్విస్టు.
అటు చూస్తేనేమో కాకా అస్సలు తగ్గడం లేదు. జనవరి 13 విడుదల ఖరారు చేస్తూ క్రమం తప్పకుండా ఏదో ఒక సౌండ్ చేస్తూనే ఉంది. ఇటీవలే తమన్ హ్యాండిల్ నుంచి కొత్త స్టిల్ ఒకటి షేర్ చేసి వచ్చే నెల మొదటి వారం నుంచి ప్రమోషన్లు షురూ అంటూ స్పష్టంగా చెప్పేశారు. షూటింగ్ అయితే నిర్విరామంగా జరుగుతోంది. తాజాగా నైట్ షెడ్యూల్ లో ఒక పాట, ఫైట్ కూడా తీశారు. ఒకవేళ పండగ టార్గెట్ లేకపోతే ఇంత హడావుడి చేయాల్సిన అవసరం లేదు కదానేది సగటు జనాల్లో మెదులుతున్న ప్రశ్న.
ఇంకో విచిత్రమైన ప్రచారం కూడా ఫిలిం నగర్ వర్గాల్లో తిరుగుతోంది. జనవరిలో కేవలం వారం రోజుల లోపే విశ్వంభర, కాకా రెండు రిలీజ్ అవుతాయనేది దాని సారాంశం. ఇది ఎంత మాత్రం సేఫ్ కాదు. ఇలా ఒకే స్టార్ హీరో రెండు సినిమాలు తలపడితే ఓపెనింగ్స్ పరంగా చాలా దెబ్బ పడుతుంది. టాక్ సంగతి పక్కనపెడితే ఆడియన్స్, ఫ్యాన్స్ ఏదో ఒక్కదానికే సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు రెండోది దెబ్బ తినడం ఖాయం. అందుకే ఆచితూచి అడుగులు వేయాలి.
నవంబర్ నెల ఆల్రెడీ సగం అయిపోయిన నేపథ్యంలో వీలైనంత త్వరగా విశ్వంభర రహస్యాన్ని విప్పి చెప్పాలి. లేదంటే అభిమానుల్లో లేనిపోని అయోమయం తలెత్తుతుంది. చిరంజీవికి ఇలాంటి విపత్కర పరిస్థితి ఎప్పుడో ఎనభై దశకంలో వచ్చింది కానీ మెగాస్టార్ అయ్యాక రిలీజుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఈసారి అనుకోకుండా ఈ క్లాష్ సమస్య వచ్చింది. దాన్ని ఎలా పరిష్కరిస్తారోనని బయ్యర్ వర్గాలతో సహా మూవీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates