జూనియర్ ఎన్టీఆర్ రాబోయే సినిమాల లైనప్ గురించి అభిమానులు, సోషల్ మీడియాలో గత మూడు నాలుగు రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. డ్రాగన్ షూటింగ్ పీక్స్ ఉన్న టైంలో హఠాత్తుగా అనిల్ రావిపూడి ప్రాజెక్టు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యంతో కూడిన షాక్ కు గురి చేసింది. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్లాన్ చేసుకున్న గాడ్ అఫ్ వార్ (ప్రచారంలో ఉన్న టైటిల్) వచ్చే సంవత్సరం ప్రారంభమవుతుందని ఎదురు చూస్తున్న టైంలో రావిపూడి కాంబో ఎవరి ఊహకు అందనిది.
నిన్న నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ జూన్ లో డ్రాగన్ రిలీజయ్యాక మనది మొదలుపెడదామని నర్మగర్భంగా త్రివిక్రమ్ మూవీ గురించి హింట్ ఇచ్చారు. అంటే రెండు సమాంతరంగా షూటింగ్ జరుపుకుంటాయనే సంకేతం అందులో కనిపిస్తుందని కొందరు భావిస్తుండగా, లేదు రావిపూడికి ఇంకొంచెం టైం పట్టొచ్చనే ఉద్దేశంతోనే ఇలా కర్చీఫ్ వేశారని మరికొందరు, ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు విశ్లేషణ చేసుకుంటూ భాష్యాలు చెబుతున్నారు.
అయితే ఇప్పటికిప్పుడు దేని గురించి నిర్ధారణకు రాలేం. ఎందుకంటే డ్రాగన్ షూట్ ఇంకా జరుగుతోంది. ప్రశాంత్ నీల్ ఎప్పుడు తారక్ ని విముక్తుడిని చేస్తాడో ఇంకా తెలియదు. బహుశా ఫిబ్రవరి పట్టొచ్చని సమాచారం. ఈలోగా అనిల్ రావిపూడి జనవరి 12 విడుదల హడావిడి అయిపోయి ఉంటుంది కాబట్టి తారక్ స్క్రిప్ట్ పనులు వేగవంతం చేస్తారు. త్రివిక్రమ్ చేతిలో కూడా గాడ్ అఫ్ వార్ ఫుల్ బౌండ్ సిద్ధంగా ఉందని వినిపిస్తోంది కానీ ఇంకొన్ని కీలక మార్పులు అవసరం కావొచ్చని వినికిడి.
ఫైనల్ గా నాగవంశీ చెప్పాలనుకున్న సారాంశం ఒకటుంది. గాడ్ అఫ్ వార్ లేట్ అవ్వదు. త్రివిక్రమ్ చిరంజీవితో వేరే సినిమా చేస్తారని, లేదా ఇంకో హీరోతో చేతులు కలుపుతారని వస్తున్న వదంతులకు చెక్ పెట్టే ప్రయత్నం కొన్ని రోజుల క్రితం ఫోటో రూపంలో, నిన్న స్పీచ్ రూపంలో ఇచ్చేశారు. జూనియర్ మీద అభిమానంతోనే వార్ 2 హక్కులు కొన్న నాగవంశీ ఇప్పుడు తన నిర్మాణంలో జరిగే గాడ్ అఫ్ వార్ ని ఆలస్యం చేసే ఉద్దేశంలో లేరనే క్లారిటీ అయితే వచ్చేసింది. ఓపెనింగ్ కోసం వెయిట్ చేయడమే తరువాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates