పెద్ది ప్రీమియర్లకు రంగం సిద్ధం

జూన్ 3 పెద్ది ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడినట్టుగా ఇవాళ ప్రముఖ దినపత్రికలో వచ్చేయడంతో ఫ్యాన్స్ తమ సెలబ్రేషన్స్ కు రెడీ అవుతున్నారు. అయితే అందరూ అనుకున్నట్టు సాయంత్రం రెండు షోలు కాకుండా రాత్రి ఎనిమిది గంటల నుంచి కేవలం ఒక షోకు మాత్రమే అనుమతి లభించినట్టు సమాచారం. ఇక పది రోజుల పాటు హైక్స్ కి సంబంధించి క్లారిటి వచ్చేసింది.

సింగల్ స్క్రీన్ లో ప్రతి టికెట్ మీద 100, మల్టీప్లెక్స్ లో ప్రతి టికెట్ మీద 125 రూపాయలు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఇవి జూన్ 13 దాకా అమలులో ఉంటాయి. ఇక అసలు చిక్కుముడి తెలంగాణ వైపు ఉంది. ఈ పెంపుకు సిఎం రేవంత్ రెడ్డి ఓకే అంటారా లేదానే దాని మీద పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇటీవలే పర్సెంటెజ్ వివాదం నేపథ్యంలో కాస్త లోతుగా ఆరాతీసి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

టైం తక్కువగా ఉండటంతో మెగా ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. వీలైనంత త్వరగా శుభవార్త చెబితే సంబరాలకు సిద్ధమవుతామని కోరుతున్నారు. ఒకవేళ టికెట్ పెంపుకి కనక నైజామ్ లో అనుమతి రాకపోతే ఆల్రెడీ అమలులో ఉన్న గరిష్ట ధరనే పాటించాల్సి ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ కు జరిగింది ఇదే. మరి పెద్దికి ఏమైనా మినహాయింపు ఇస్తారా, బడ్జెట్ దృష్టిలో పెట్టుకుని వెసులుబాటు కలిగిస్తారా అనేది వేచి చూడాలి. రేపో ఎల్లుండో తేలిపోవచ్చు.

పెద్ది మీద థియేటర్ వర్గాలు బోలెడు ఆశలు పెట్టుకున్నాయి. కళతప్పిన తమ వ్యాపారాలకు జీవం పొసే సినిమా ఇదే అవుతుందని భావిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా డబ్బింగ్ సినిమాలే ఫీడింగ్ చేశాయి. వీరభద్రుడు, దృశ్యం 3, బ్లాస్ట్ జోన్ చిత్రాలే కాసింత డీసెంట్ టాక్ తో జనాన్ని థియేటర్లకు రప్పించాయి. టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ మాత్రం అత్యధిక శాతం నిరాశపరిచినవే. సో పెద్ది ఇప్పుడు బాక్సాఫీస్ కు ఆక్సిజన్ గా మారాల్సిన అవసరం చాలా అంటే చాలా ఉంది.