శాటిలైట్ మార్కెట్ ఒకప్పటిలా లేదన్నది వాస్తవం. ముఖ్యంగా కరోనా తర్వాత ఓటిటిల డామినేషన్ పెరిగాక క్రమంగా టీవీ ఛానల్స్ చూసేవాళ్ళు తగ్గిపోయారు. ఇంతకు ముందు కొత్త సినిమా థియేటర్ రిలీజ్ జరిగిన ఆరు నెలల తర్వాత మొదటిసారి ఛానల్ లో వస్తుంటే వరల్డ్ ప్రీమియర్ పేరుతో జరిగే హంగామా మాములుగా ఉండేది కాదు. ఎప్పుడైతే నెల రోజుల విండోతో డిజిటల్ స్ట్రీమింగ్ పెరిగిపోయిందో అప్పటి నుంచి టీవీ రేటింగ్స్ ప్రభావితం చెందడం మొదలయ్యాయి.
అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు తర్వాత పాతిక పైన టిఆర్పి సాధించిన సినిమాల్లో రాజమౌళివి కూడా లేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య పాత బ్లాక్ బస్టర్లను కూడా రెన్యూవల్ చేసుకోలేని స్టేజిలో కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే 2025 అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన పవన్ కళ్యాణ్ ఓజికి ఇప్పటిదాకా శాటిలైట్ డీల్ జరగలేదు. తాజాగా ఈటీవీ ఛానల్ ఆ హక్కులను సొంతం చేసుకుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది.
జూనియర్ ఎన్టీఆర్ దేవర కూడా ఒప్పందం చేసుకునే దారిలో ఈటీవీ ఉందనే టాక్ ఇప్పటికే టీవీ వర్గాల్లో తిరుగుతోంది. ఇంకా ఫైనల్ కాలేదట కానీ ఆల్మోస్ట్ అవ్వొచ్చని అంటున్నారు. నిజానికి ఈటీవీ కొత్త సినిమాలను కొనే విషయంలో ఎప్పుడూ దూకుడుగా ఉండదు. సీరియల్స్, రియాలిటీ షోల మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఈటీవీ విన్ ని బలపరుచుకునే దిశగా అడుగులు వేసింది. తాజాగా ఓజి, దేవర లాంటివి సొంతం చేసుకోవడం చూస్తుంటే క్రేజీ అనిపిస్తోంది.
ప్రస్తుతం శాటిలైట్ రంగంలో ఈటీవీతో పాటు జెమిని, స్టార్ మా, జీ తెలుగు మధ్య కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. మొదటిది తప్ప మిగిలిన మూడు ఛానల్స్ కొత్త సినిమాల విషయంలో పోటీ తత్వం చూపించేవి. ఇప్పుడు ఓజిని తీసుకుని దేవరను కూడా స్వంతం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్న ఈటీవీ రాబోయే రోజుల్లో ఇదే స్ట్రాటజీ కొనసాగిస్తే మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎంత చేసినా ఓటిటి ట్రెండ్ లో శాటిలైట్ నుంచి వచ్చే ఆదాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates