దృశ్యం బ్రాండ్ విలువ అలాంటిది

దృశ్యం 3 నచ్చిందా లేదానేది పక్కనపెడితే కేవలం మూడు రోజులకే వంద కోట్ల గ్రాస్ దాటిందనేది వాస్తవం. మలయాళం వెర్షన్ కు సైతం మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. తెలుగు తమిళ భాషల్లో నెగటివ్ రిపోర్ట్స్ ఎక్కువగా వినిపించాయి. సోషల్ మీడియాలోనూ టాలీవుడ్ జనాలు ఎక్స్ ట్రాడినరి అని మెచ్చుకున్న దాఖలాలు లేవు. అయినా సరే ఏపీ తెలంగాణలో నాలుగు రోజులు డీసెంట్ ఆక్యుపెన్సీలు కనిపించాయి. మన స్ట్రెయిట్ సినిమాల షోలు క్యాన్సిల్ అయితే దీనికి మాత్రం వేశారు.

ఇది మోహన్ లాల్ చేసిన మేజిక్కా అంటే ఎంతమాత్రం కాదు. ఎందుకంటే కేవలం ఆయన పేరు మీద మన దగ్గర సినిమా నడవదు. బరోజ్ లాంటివి పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కు తేలేదు. వృషభ దారుణంగా పోయింది. పేట్రియాట్ కనీసం డబ్బింగ్ చేసే సాహసం కూడా చేయలేదు. డబ్బింగ్ వెర్షన్ నేరుగా ఓటిటిలో వస్తోంది. ఎంపురాన్ కూడా ఇక్కడ పెద్దగా ఆడింది లేదు. ఒక్క తుడరమ్ మాత్రమే అంతో ఇంతో వసూళ్లు తెచ్చి నిర్మాతను సేఫ్ చేసింది.

దృశ్యం విషయంలో ముమ్మాటికీ పని చేసింది దాని బ్రాండే తప్ప వేరొకటి కాదు. వెంకటేష్ నటించిన మొదటి రెండు భాగాలు విపరీతమైన ఆదరణకు నోచుకున్నాయి. దృశ్యం 2 డైరెక్ట్ ఓటిటి రిలీజైనా జనం ఆదరించారు. అయితే మూడో భాగంలో రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని మనోళ్లు చూడగలరా లేదా అంటే చూస్తారనే క్లారిటీ మార్నింగ్ షోతోనే వచ్చింది. దర్శకుడు జీతూ జోసెఫ్ కంటెంట్ పరంగా కొంత నిరాశ పరిచినప్పటికీ జనాన్ని థియేటర్లకు వచ్చేలా చేశాడు.

రేపటి నుంచి డ్రాప్స్ ఎంత ఉంటాయనేది పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల్లో దృశ్యం 3కి ప్రతి రూపాయి బోనస్ కిందకే వస్తుంది. ఎందుకంటే వెంకటేష్ లేకుండా మోహన్ లాల్ ని చూపిస్తున్నాం కాబట్టి జనం రిసీవ్ చేసుకుంటారో లేదోననే అనుమానంతో పబ్లిసిటీని లైట్ తీసుకున్నారు. కానీ ఆడియన్స్ వచ్చారు. ఒకవేళ యునానిమస్ టాక్ వచ్చి ఉంటే వసూళ్లు నెక్స్ట్ లెవెల్ లో ఉండేవేమో కానీ ఈ మాత్రం స్పందన దక్కించుకోవడం మాత్రం చిన్న విషయం కానేకాదు.