హనుమాన్ విజయమే మహాకాళీ ధైర్యం

2027 సంక్రాంతి పందెం క్రమంగా వేడెక్కుతోంది. శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబో ‘ జార్జ్ క్రిష్’ జనవరి 14 డేట్ ఖాయం చేసుకుని అధికారిక ప్రకటన, ఓపెనింగ్ రెండూ చేసేసింది. వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న సినిమా ఎట్టి పరిస్థితుల్లో పండగ రేసు మిస్ కాకుండా పరుగులు పెడుతోంది. చిరంజీవి – బాబీ కొల్లి మెగా 158 అదే సీజన్ మీద కన్నేసింది. మెగాస్టార్ పుట్టినరోజు వచ్చే టీజర్ లో అఫీషియల్ క్లారిటీ రానుంది. ఇక్కడి దాకా ఏ సమస్యా లేదు.

అయితే పోటీలో మేమంటే మేమంటూ ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. ప్రశాంత్ వర్మ రచన ప్లస్ నిర్మాణంలో రూపొందుతున్న భారీ ఫాంటసీ మూవీ మహా కాళీని జనవరి 8 విడుదల చేసేందుకు నిర్ణయం జరిగిపోయిందని సమాచారం. పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో అక్షయ్ ఖన్నా ఒక కీలక పాత్ర పోషిస్తుండగా భూమి శెట్టి టైటిల్ రోల్ పోషిస్తోంది. ఎన్నో నెలలుగా పెద్దగా హడావిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా ఇది.

ఇదంతా బానే ఉంది కానీ స్టార్ క్యాస్టింగ్ లేకుండా మహా కాళీ కేవలం విఎఫ్ఎక్స్ ని నమ్ముకుని ఇంత రిస్క్ చేస్తోందా అంటే దానికి సమాధానం హనుమాన్ అనే వినిపిస్తోంది. ఎందుకంటే మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగా, వెంకటేష్ సైంధవ్ లాంటి తీవ్రమైన కాంపిటీషన్ తట్టుకుని హనుమాన్ బ్లాక్ బస్టర్ అందుకుంది. తేజ సజ్జని వాడుకుని కొందరు యాంటీ ఫ్యాన్స్ మహేష్ బాబుని టార్గెట్ చేయడం దాకా ఆ టైంలో సెన్సేషన్. ఇదంతా మూడేళ్ళ కింద ముచ్చట.

ఒక రిస్క్ ఏంటంటే మహా కాళీ కంటెంట్ ఎంత బలంగా ఉన్నా దీనికి దర్శకుడు ప్రశాంత్ వర్మ కాదు. కానీ ప్రొడ్యూసర్ కం రైటర్ కాబట్టి ఆ బ్రాండ్ ఇమేజ్ ఖచ్చితంగా మార్కెట్ లో ఉపయోగపడుతుంది. మరి హనుమాన్ టైంలో ఉన్న కాన్ఫిడెన్స్ ఇప్పుడూ కొనసాగించడం మంచిదే కానీ కొంచెం ప్రాక్టికల్ గా చూస్తే వసూళ్ల మీద ప్రభావం ఉంటుందిగా. టీమ్ మాత్రం ఫలితం పట్ల చాలా ధీమాగా ఉంది. మహా కాళీలో అమ్మవారి మహిమలకు సంబంధించి ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో డిజైన్ చేశారని వినికిడి.