బట్వారా పబ్లిక్ టాక్ తేడాగా ఉందే…

తాజాగా విడుదలైన బట్వారా 1947 ఆశించిన స్థాయిలో ఓపెనింగ్ తెచ్చుకోలేకపోవడం బయ్యర్ వర్గాలను నిరాశ పరుస్తోంది. అనూహ్యంగా ఆవారాపన్ 2 భారీ వసూళ్లు రాబట్టుకోవడమే కాక హైదరాబాద్ లాంటి దక్షిణాది నగరాల్లో టికెట్లు దొరకని స్థాయిలో రచ్చ చేస్తోంది. దానికి రివర్స్ లో అమీర్ ఖాన్ నిర్మాణంలో సన్నీ డియోల్ హీరోగా రూపొందిన సినిమాకు, అందులోనూ రాజ్ కుమార్ సంతోషి లాంటి సీనియర్ దర్శకుడి కంటెంట్ కి తక్కువ స్థాయి రెస్పాన్స్ రావడం ఊహించనిది.

నిజానికి ట్రైలర్ దగ్గరే సమస్య వచ్చింది. గదర్ రేంజ్ లో ఊహించుకున్న జనాలకు ఇందులో ఆ స్థాయి విజువల్స్ కనిపించకపోవడం మొదటి రోజే చూడాలన్న ఆసక్తిని తగ్గించేసింది. పైగా ప్రమోషన్స్ టైంలో పాకిస్థాన్ గురించి సన్నీ డియోల్ అన్న మాటలను ఇంకో విధంగా అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో తిప్పడం కొంత ప్రతికూలత చూపింది. చాలా గ్యాప్ తర్వాత ప్రీతీ జింటా ఇందులో ఫుల్ లెన్త్ రోల్ చేయడం విశేషం. ఇంతకీ కథా కమామీషు ఏంటో చూద్దాం.

1947 దేశ విభజన జరిగినప్పుడు సికందర్ మీర్జా (సన్నీ డియోల్) అనే వ్యాపారి భార్యా పిల్లలతో కలిసి పాకిస్థాన్ వెళ్తాడు. అక్కడ తొలి దశలో అష్టకష్టాలు అనుభవించాక ప్రభుత్వం దుర్గ నివాస్ అనే పెద్ద భవంతిని అతనికి ఇస్తుంది. అయితే పై అంతస్థులో మాయి (షబానా అజ్మీ) అనే వృద్ధురాలు అక్కడ తిష్ట వేసుకుని ఉంటుంది. ఆమెను తరిమేందుకు స్థానిక మత సంఘాలు పూనుకుంటాయి. ముసలామెకు రక్షణగా సికందర్ నిలబడతాడు. సమాజానికి ఎదురు నిలిచి ఎలా కాపాడాడు అనేదే స్టోరీ.

గదర్ లాగా బట్వారాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా లేవు. భావొద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చిన దర్శకుడు అభిమానులు కోరుకునే అంశాలను బ్యాలన్స్ చేయలేకపోయారు. అందులోనూ కథ మొత్తం పాకిస్థాన్ లో జరగడంతో నేటివిటీ ఫ్యాక్టర్ సున్నా అయిపోయింది. దురంధర్ కూడా పాక్ లోనే జరుగుతుంది కానీ దాంట్లో కట్టిపడేసే యాక్షన్ డ్రామా ఉంటుంది. బట్వారాలో అది మిస్సయ్యింది. సన్నీ డియోల్ నటన, పార్టీషన్ పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు ట్రై చేయొచ్చు కానీ మిగిలిన వాళ్ళతో పాస్ అనిపించుకోవడం కష్టమే.