మతిపోయే రేటు చెబుతున్న రామాయణ ?

రన్బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న రామాయణ దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఆ మధ్య వచ్చిన టీజర్ కు మిశ్రమ స్పందన రావడంతో అలెర్ట్ అయిన టీమ్ సాయిపల్లవి పుట్టినరోజుకి కనీసం పోస్టర్ కూడా విడుదల చేయలేదు. రిలీజ్ టైం ఎంతో దూరంలో లేకపోవడంతో థియేటర్ బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. నాలుగు వేల కోట్లతో రెండు భాగాలు తీశామని నిర్మాత నమిత్ మల్హోత్రా పలు ఇంటర్వ్యూలలో చెప్పడం ఇప్పటికే వైరలైన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ వర్గాల కథనం ప్రకారం రామాయణకు ఒక్క హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 400 నుంచి 450 కోట్ల దాకా ఆశిస్తున్నట్టు తెలిసింది. ఇది చాలా పెద్ద మొత్తం. ఎందుకంటే ఇప్పటిదాకా హయ్యెస్ట్ రికార్డ్ డిసెంబర్ లో రిలీజయ్యే షారుఖ్ ఖాన్ మూవీ కింగ్ మీద ఉంది. దానికైన థియేటర్ డీల్స్ 250 కోట్ల దాకా ఉన్నాయట. దానికన్నా డబుల్ మార్జిన్ తో రామాయణకు రేట్ పలకడం అనూహ్యం. పెన్ స్టూడియోస్, ఏఏ సంస్థలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయని తెలిసింది.

నార్త్ బయ్యర్ వర్గాల ప్రకారం 300 కోట్ల దాకా ఫైనల్ కావొచ్చని వినికిడి. కానీ నమిత్ మల్హోత్రా మాత్రం పట్టుదలగా ఉన్నారని తెలిసింది. తెలుగుతో సహా ఇతర డబ్బింగ్ హక్కులు అదనంగా వేరే ఉంటాయి. ఇదంతా తేలడానికి ఇంకో ఒకటి రెండు నెలలు పట్టేలా ఉంది. దర్శకుడు నితేశ్ తివారి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లొ బిజీగా ఉండగా రన్బీర్ కపూర్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తీస్తున్న లవ్ అండ్ వార్ మీద పూర్తి ఫోకస్ పెట్టేశాడు.

రామాయణ ప్రమోషన్లను ఎప్పటి నుంచి మొదలుపెట్టాలనేది నిర్మాణ సంస్థ ఇంకా డిసైడ్ కాలేదు. సీతగా నటించిన సాయిపల్లవికి ఇటీవలే ఏక్ దిన్ రూపంలో భారీ డిజాస్టర్ దక్కింది. అమీర్ ఖాన్ కోసం ఆయన కొడుకు సరసన నటిస్తే కెరీర్ లోనే అతి పెద్ద ఫ్లాప్ దక్కింది. ఇప్పుడా గాయాన్ని రామాయణతో పూర్తిగా మాన్పుకోవాలి. టీజర్ మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాక ఇప్పుడు అందరి కళ్ళు ట్రైలర్ మీద ఉన్నాయి. అక్టోబర్ లో దసరా సందర్భంగా లాంచ్ చేయొచ్చని టాక్.