పెద్ది రూ.1000 కోట్లు కొట్టాలంటే…

టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా రోజులుగా డ్రైగా ఉంది. సంక్రాంతి తర్వాత థియేటర్‌కి పండగ తెచ్చిన సినిమా ఒక్కటీ పడలేదు. ఏదో వచ్చాయి, వెళ్లాయి. కానీ కటౌట్‌కి దండలు పడేలా, సింగిల్ స్క్రీన్‌లో పేపర్లు ఎగిరేలా, ఫ్యాన్స్ వైబ్‌తో ఊగిపోయే సినిమా మిస్ అయ్యింది. ఆడియెన్స్ థియేటర్‌కి రావడం లేదు అనేది నిజమే. కానీ థియేటర్ వరకు లాక్కొచ్చే కంటెంట్ కూడా రాలేదు. ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి ‘పెద్ది’ వస్తోంది.

పెద్ది టైమింగ్ చాలా కీలకం. సమ్మర్‌లో రావాల్సిన సినిమా పలు కారణాల వల్ల జూన్ 4కి షిఫ్ట్ అయ్యింది. అది నెగెటివ్ కాదు, బోనస్ అయ్యే ఛాన్స్ ఉంది. జూన్ 4 అంటే స్కూల్స్‌కి ఇంకా 10 రోజులు సెలవులు ఉంటాయి. IPL హడావుడి పూర్తిగా ముగుస్తుంది. ఎండలు తగ్గి, జనం బయటకు వచ్చే సీజన్ స్టార్ట్ అవుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఫ్యామిలీస్ అన్నీ ఎదురుచూస్తున్న టైమ్ ఇది. సరైన సినిమా పడితే ఎగబడతారు.

ఇక్కడే ‘పెద్ది’కి గోల్డెన్ ఛాన్స్ ఉంది. ప్రేక్షకులు ఆకలితో ఉన్నారు. కొన్ని నెలలుగా థియేటర్‌లో సెలబ్రేట్ చేసుకోవడానికి సినిమా లేదు. ఈ డ్రై స్పెల్‌ని బ్రేక్ చేసే కంటెంట్ ‘పెద్ది’ దగ్గర ఉండాలి. బుచ్చిబాబు సానా ఇప్పటికే చరణ్‌ని 4 వేరియేషన్స్‌లో చూపిస్తున్నట్లు హింట్ ఇచ్చాడు. 3 గంటల రన్‌టైమ్ అంటే కథ మీద నమ్మకం ఉన్నట్టే. ట్రైలర్‌ వర్కవుట్ అయితే స్ట్రాంగ్ ఓపెనింగ్స్ గ్యారెంటీ.

కలెక్షన్ల లెక్క కూడా ‘పెద్ది’కి అనుకూలంగా ఉంది. సింగిల్ స్క్రీన్స్ రేట్లు పెంచడం లేదని తెలంగాణ ఎగ్జిబిటర్స్ చెప్పారు. అంటే ఫ్యామిలీ ఆడియెన్స్‌కి భారం తగ్గుతుంది. రిపీట్ ఆడియెన్స్ పెరుగుతుంది. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి హిందీ, తమిళ్, మలయాళం మార్కెట్ కూడా ఓపెన్ అవుతుంది. ‘RRR’ తర్వాత చరణ్‌కి నార్త్‌లో ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకునే ఛాన్స్ ఇది. తెలుగు స్టేట్స్‌లో వీకెండ్ హౌస్‌ఫుల్స్ పడితే, నార్త్‌లో వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయితే లెక్క మారిపోతుంది.

అసలు కీ మాత్రం కంటెంట్. 1000 కోట్లు అనేది ట్రేడ్ నంబర్ కాదు, ఆడియెన్స్ ఎమోషన్. పుష్ప 2, కేజీఎఫ్ 2, RRR 1000 కోట్లు కొట్టాయి అంటే కారణం కథ కనెక్ట్ అవ్వడమే. థియేటర్‌కి వెళ్లిన ప్రతి ఒక్కడికీ టికెట్ డబ్బులు వసూల్ అయ్యాయనే ఫీలింగ్ రావాలి. ‘పెద్ది’ ఆ ఫీలింగ్ ఇస్తే, ఎండిపోయిన బాక్సాఫీస్‌కి వర్షం పడ్డట్టే. జనం ఎగబడి సినిమా చూస్తారు. కలెక్షన్లు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి.