థియేట‌ర్ల‌లో వ‌చ్చిన 12వ రోజుకే..

థియేట్రిక‌ల్ రిలీజ్‌కు, డిజిట‌ల్ రిలీజ్‌కు మ‌ధ్య గ్యాప్ త‌గ్గిపోవ‌డ‌మే.. సినిమాల వ‌సూళ్లు ప‌డిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అంటూ ఎప్పుడూ చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. నిర్మాత‌లు సైతం ఇదే మాట చెబుతుంటారు. కానీ అలా మాట్లాడే నిర్మాత‌లే.. త‌మ సినిమాలను త‌క్కువ గ్యాప్‌లో ఓటీటీలోకి తీసుకొచ్చేస్తుంటారు.

థియేట‌ర్ల‌లో రిలీజైన త‌క్కువ రోజుల‌కే ఓటీటీలోకి సినిమా వ‌స్తుండ‌డంతో థియేట‌ర్‌కు వెళ్లి సినిమా చూడాల్సిన అవ‌స‌ర‌మేంటి, అయినా థియేట‌ర్ల‌కు వెళ్లి చూసేంత కంటెంట్ ఎన్ని సినిమాల్లో ఉంటోంది అన్న‌ది ప్రేక్ష‌కుల వాద‌న‌. అదే స‌మ‌యంలో జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌ట్లేదు కదా, అలాంట‌పుడు త‌క్కువ టైంలో డిజిట‌ల్ రిలీజ్‌కు ఓకే చెబితే ఎక్కువ రేటు ఇచ్చే ఓటీటీలతో డీల్స్ చేసుకుంటే త‌ప్పేంటి అన్న‌ది నిర్మాత‌ల అభిప్రాయం. ఇందులో ఎవ‌రి వాద‌న క‌రెక్ట్ అన్న‌ది చెప్ప‌లేం.

కానీ థియేట్రిక‌ల్, డిజిట‌ల్ రిలీజ్‌కు మ‌ధ్య గ్యాప్ అంతకంత‌కూ త‌గ్గిపోతోంద‌న్న మాట మాత్రం వాస్త‌వం.
కొన్ని నెల‌ల ముందు పాంచ్ మినార్ అనే సినిమాను థియేట‌ర్ల‌లో రిలీజైన వారం రోజుల‌కే ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇంకో సినిమాను కేవ‌లం 12 రోజుల గ్యాప్‌లో ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ఆ చిత్ర‌మే.. స‌తీ లీలావ‌తి.

విడుద‌ల కోసం చాలా రోజుల పాటు ఎదురు చూసిన ఈ సినిమాను మే 8న థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసింది చిత్ర బృందం. కానీ ఈ సినిమాకు బ్యాడ్ టాక్ రావ‌డం, ప్రి రిలీజ్ బ‌జ్ కూడా పెద్ద‌గా లేక‌పోవ‌డంతో థియేట‌ర్ల‌లో దారుణ‌మైన ఫ‌లితం వ‌చ్చింది. ప‌బ్లిసిటీ ఖ‌ర్చులు కూడా వెన‌క్కి రాని ప‌రిస్థితి. థియేట‌ర్ల‌లో ఏమాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయిన లావ‌ణ్య త్రిపాఠి చిత్రాన్ని ఈ నెల 20న డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం చేశారు. స‌న్ నెక్ట్స్ ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతోంది.

మ‌రోవైపు ఈ నెల 1న వ‌చ్చిన జెట్లీ సినిమాను కూడా అనుకున్న దాని కంటే కొంచెం తొంద‌ర‌గానే ఓటీటీలోకి తెస్తున్నారు. థియేట‌ర్ల‌లో రిలీజైన 24వ రోజుకే ఈ చిత్రాన్ని స్ట్రీమ్ చేయ‌బోతున్నారు. జియో హాట్ స్టార్ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయ‌నుంది.