హనుమాన్ 3D వర్కౌట్ అవుతుందా

తేజ సజ్జ కెరీర్ ని ఒక్కసారిగా మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ హనుమాన్. మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ల పోటీని తట్టుకుని మరీ 2024 సంక్రాంతి విజేతగా నిలవడం మాములు విషయం కాదు. ఒకవేళ ఇది లేకపోయి ఉంటే గుంటూరు కారం మరింత బెటర్ గా అడేదన్న అభిమానుల కామెంట్స్ అంత ఈజీగా కొట్టిపారేయలేం. దీన్ని 3డి వెర్షన్ లో జూన్ 26 ప్రపంచవ్యాప్తంగా మరోసారి విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

మాములుగా రీ రిలీజులు పదేళ్ల క్రితం వచ్చినవి అయితే బాగుంటాయి. కానీ మరీ రెండు మూడేళ్ళ వెనుకవి అంటే ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. అందులోనూ హనుమాన్ లో ఉన్నది స్టార్ హీరో కాదు. సెలెబ్రేట్ చేసుకోవడానికి మాస్ మూమెంట్స్ ఉండవు. అందులోనూ పెద్ది వచ్చిన ఇరవై రోజులకు దీన్ని తేవడం అంటే కొంచెం రిస్క్ అనే చెప్పాలి. పైగా అదే రోజు అఖిల్ లెనిన్ పెద్ద ఎత్తున రిలీజవుతోంది. దీని అంచనాలు తెలిసిందే.

కాకపోతే హనుమాన్ కున్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే కొత్తగా రీ మాస్టరింగ్, 4కె, సౌండ్ మిక్స్ లాంటివి చేయాల్సిన అవసరం లేదు. అంతా రెడీగా ఉంది. క్యూబ్ గట్రా అప్లోడ్ చేయాల్సిన పని లేదు. డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుకుని థియేటర్ రెంట్లు కట్టుకుంటే చాలు షోలు వేసేయొచ్చు. సెన్సార్ అవసరం లేదు. పదేళ్లు దాటలేదు కాబట్టి నేరుగా థియేటర్లకు వెళ్లిపోవచ్చు. ఇన్ని సానుకూలతలు ఉన్నాయి కాబట్టి హనుమాన్ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు.

ఇక హనుమాన్ నిర్మాతలు తీసిన ప్యాన్ ఇండియా మూవీ సంబరాల ఏటిగట్టు మాత్రం ఎటూ తేల్చడం లేదు. విడుదల తేదీ విషయంలో ఏర్పడ్డ సందిగ్దత ఇంకా కొనసాగుతోంది. షూటింగ్ ఇంకొంచెం బాలన్స్ ఉందని వినిపిస్తున్న నేపథ్యంలో అసలు 2026 విడుదల ఉంటుందా లేదానే అనుమానాలు లేకపోలేదు. ఇలాంటి హనుమాన్ ని మళ్ళీ తీసుకురావడం చూస్తుంటే ఏదో కోట్లు వచ్చి పడతాయని కాదు కానీ 3డి వెర్షన్ కాబట్టి జనం బాగానే చూస్తారనే అంచనా కావొచ్చు.