టాలీవుడ్లో హీరోలు దర్శకులవడం కొత్త కాదు కానీ.. ఈ జాబితా మరీ పెద్దదేమీ కాదు. తాజాగా యువ కథానాయకుడు రామ్ పోతినేని దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. తనే హీరోగా ఒక సైకలాజికల్ థ్రిల్లర్లో నటిస్తున్నాడు రామ్. ఈ చిత్రాన్ని రామ్ సోదరుడు కృష్ణ పోతినేని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్.. వీర అనే పాత్రలో నటిస్తున్నాడు. టాలీవుడ్లో దర్శకత్వం నుంచి నటన వైపు వచ్చిన వాళ్లు చాలామందే ఉన్నారు కానీ.. హీరోలు దర్శకులవ్వడం మాత్రం ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతోంది.
ఇప్పుడున్న హీరోల్లో రామ్ కంటే ముందు ఈ సాహసం చేసింది విశ్వక్సేన్ మాత్రమే. అతను కెరీర్ ఆరంభంలోనే ఫలక్‌నుమా దాస్ తీశాడు. తర్వాత ధమ్కీ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పుడు కల్ట్ అనే సినిమా తీస్తున్నాడు. అడివి శేష్ ఒకేసారి దర్శకుడిగా, హీరోగా పరిచయం అయ్యాడు. కర్మ సినిమా తీశాడు. తర్వాత తనే హీరోగా కిస్ అనే సినిమా తీశాడు. ఐతే ముందు హీరోగా పరిచయం అయి.. తర్వాత దర్శకుడిగా మారిన జాబితాలో అతనుండడు.
ఇక ముందు తరంలో దర్శకత్వం చేపట్టిన స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ పేరును ప్రముఖంగా ప్రస్తావించాలి. ఆయన జానీ సినిమా తీసిన సంగతి తెలిసిందే. తర్వాత సత్యాగ్రహి అనే మరో సినిమా కూడా తీయాలనుకున్నాడుడ కానీ.. కుదరలేదు. పవన్ కంటే ముందు తరంలో లెజెండరీ నటులు ఎన్టీ రామారావు, కృష్ణలిద్దరూ దర్శకత్వం చేపట్టారు.
ఎన్టీఆర్ దానవీర శూర కర్ణ సహా పది సినిమాలకు పైగానే తీశారు. అందులో అయిదు సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ సైతం దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆయన ఖాతాలో సింహాసనం లాంటి బ్లాక్ బస్టర్ ఉంది.
ఇలా టాలీవుడ్లో దర్శకత్వం వైపు అడుగులు వేసిన హీరోల సంఖ్య చాలా తక్కువే. హీరోయిన్లలో భానుమతి రామకృష్ణ, విజయ నిర్మల తదితరులు దర్శకులుగా మంచి స్థాయిని అందుకున్నారు. ఇక హీరోలు కాకుండా నటన నుంచి దర్శకులైన వాళ్ల జాబితా పెద్దదే. రవిబాబు, వెన్నెల కిషోర్ లాంటి వాళ్లు ఈ జాబితాలో కనిపిస్తారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
