పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన టాలీవుడ్లోకి అడుగు పెట్టారు. అంతకంటే ముందు రెండు తమిళ చిత్రాలను నిర్మించిన ఆయనకు సరైన విజయం దక్కలేదు. కానీ ‘బలుపు’తో పాటు ‘క్షణం’ సినిమా పీవీపీ మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఊపిరి, బ్రహ్మోత్సవం, మహర్షి లాంటి భారీ చిత్రాలను ఆయన నిర్మించారు.
ఇందులో ఊపిరి, మహర్షి ఆయనకు మంచి ఫలితాలనే అందించాయి. కానీ ఉన్నట్లుండి పీవీపీ ఇండస్ట్రీని వదిలేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను సినిమాల నిర్మాణం ఆపేయడానికి కారణమేంటో పీవీపీ వెల్లడించారు.
సినిమాలు నిర్మించడం కంటే దారుణమైన బిజినెస్ ప్రపంచంలో ఇంకొకటి లేదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. మనం డబ్బులు పెట్టి అవమానాలు ఎదుర్కోవడం కంటే దారుణమైన విషయం లేదని.. సినీ రంగంలో ఉంటే మన మీద మనే పెంట వేసుకున్నట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
‘టెంపర్’ సినిమాకు సంబంధించి బండ్ల గణేష్‌తో వివాదం గురించి పీవీపీ స్పందించారు. ఆ సినిమాకు తాను సోలో ఫైనాన్షియర్ అని.. బ్యాంకు తరహాలో వడ్డీకి అప్పు ఇచ్చి, దాన్ని వసూలు చేసుకోవాలనుకున్నపుడు ఇబ్బందులు తలెత్తాయని ఆయన అన్నారు. మన డబ్బులు మనం తీసుకోవడానికి అవమానాలు పడాల్సిన అవసరం ఏంటని ఆయన అన్నారు.
ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాత ఒక జోకర్ లాగా అయిపోయాడని.. డబ్బులు పెట్టి సినిమా తీసే నిర్మాత మీద సెట్లో అందరూ జోకులు వేస్తుంటారని.. సినిమా పోతే రోడ్డున పడేది నిర్మాతే అని, అయినా తన మీద ఎవరికీ ఏ ఆందోళనా ఉండదని.. పైగా తనను బఫూన్ లాగా చూస్తారని పీవీపీ వ్యాఖ్యానించారు.
హాలీవుడ్లో మాదిరి ఇక్కడ స్టూడియో సిస్టం లేదని.. హీరోలే ఇండస్ట్రీని నడిపిస్తున్నారని.. నిర్మాతలకు విలువ లేదని.. అందుకే ఇలాంటి ఇండస్ట్రీలో ఉండడం ఎందుకు అనే తాను బయటికి వెళ్లిపోయినట్లు ఆయన చెప్పాడు. తాను రాజకీయ వేత్తను కాదని.. రాజకీయాల మీద అవగాహన మాత్రమే ఉందని.. అందుకే ఆ రంగం నుంచి తప్పుకున్నట్లు పీవీపీ తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates