టార్గెట్ పెట్టుకున్న ప్రభాస్ ఫౌజీ

ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కలయికలో తెరకెక్కుతున్న ఫౌజీ షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. ఒక మూడు యాక్షన్ ఎపిసోడ్స్ తప్ప మిగిలినదంతా పూర్తయ్యిందని యూనిట్ సమాచారం. అక్టోబర్ రిలీజ్ టార్గెట్ గా పెట్టుకుని పనులు వేగవంతం చేశారని అంటున్నారు. తొలుత దీపావళి ఆప్షన్ పరిశీలించినప్పటికీ రామాయణ పార్ట్ 1 అదే టైంలో ఉండటంతో దాంతో క్లాష్ అవ్వడం ఓవర్సీస్ మార్కెట్ పరంగా అంత సేఫ్ కాదని భావించడం సబబనే చెప్పాలి.

స్పిరిట్ 2027 మార్చిలో వచ్చేస్తుంది కాబట్టి దానికి ముందు కనీసం అయిదారు నెలల గ్యాప్ ఉండటం ఎంతైనా అవసరం. అందులోనూ ఓటిటి క్యాలెండర్లతో సింక్ చేసుకోవాలి కనక హడావిడిగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు. ఈ సంవత్సరం రాజా సాబ్ దారుణంగా నిరాశ పరచడమే కాదు ట్రోలింగ్ కు గురి కావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదిపురుష్ తర్వాత ఆ స్థాయి విమర్శలు దక్కించుకున్న డార్లింగ్ మూవీ ఇదొక్కటే.

ఆ గాయం పోగొట్టే బాధ్యత ఫౌజీ మీద ఉంది. స్వాతంత్రం రాకముందు నలభైయ్యవ దశకం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీలో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తాడు. వార్ డ్రామాతో పాటు హను మార్క్ అద్భుతమైన లవ్ స్టోరీ ఇందులో ఉంటుందట. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా కాలం వెంటాడుతుందని చెబుతున్నారు. స్టార్ హీరోలు ఎవరూ ఇప్పటిదాకా చేయని స్థాయిలో చివరి ఘట్టం గురించి అందరూ మాట్లాడుకుంటారని తెగ ఊరిస్తున్నారు. అదేంటో తెరమీద చూడాలి.

ఇక కల్కి 2 ఆల్రెడీ సెట్స్ కు వెళ్ళిపోయింది. ప్రభాస్ అవసరం లేని ఎపిసోడ్లను దర్శకుడు నాగ అశ్విన్ చకచకా పూర్తి చేస్తున్నారు. దీనికి రిలీజ్ డేట్ టెన్షన్ లేదు కాబట్టి హడావిడి పడే ఉద్దేశంలో లేరు. 2028 విడుదలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం మూడు సినిమాలను లైన్ లో పెట్టేసిన ప్రభాస్ ఆ తర్వాత సలార్ 2 ఎప్పుడు ఉంటుందో ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా మూవీలో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఇంకో ఏడాదిన్నర దాకా దొరికేలా లేరు.

టార్గెట్ కనక ఫౌజీ చేరుకునే పనైతే వేసవి నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టాల్సి ఉంటుంది. విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలు మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం వెకేషన్ కోసం బ్రేక్ తీసుకున్న ప్రభాస్ తిరిగి రాగానే ముందు ఫౌజీ సెట్స్ లోనే అడుగు పెట్టబోతున్నాడు. అవసరాన్ని బట్టి స్పిరిట్ ని సమాంతరంగా చేస్తారు. సందీప్ రెడ్డి వంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో అనౌన్స్ చేసిన డేట్ మిస్ కాకూడదనే సంకల్పంతో ఉన్నారు.