ముహూర్తం ఫిక్స్ చేసుకున్న జన నాయకుడు ?

సెన్సార్ చిక్కులు, రాజకీయ వలయాల మధ్య ఇరుక్కుపోయి నాలుగు నెలలుగా విడుదల కోసం ఎదురు చూస్తున్న జన నాయకుడు ఎట్టకేలకు మే 8 థియేటర్లలో అడుగు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు చెన్నై వర్గాల విశ్వసనీయ సమాచారం. రివైజింగ్ కమిటీ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇవాళో రేపో సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. అధికారులు చెప్పిన కట్స్, మ్యూట్స్ కి దర్శక నిర్మాతలు అంగీకరించడంతో లైన్ క్లియరయ్యిందని అంటున్నారు.

కాకపోతే చేతిలో కేవలం పది రోజుల టైం మాత్రమే ఉండటంతో విజయ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే మే 4 ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఒకవేళ టీవీకే పార్టీ గెలిస్తే ఆ ఆనందంతో రెట్టింపు సంబరాలు జన నాయకుడుకి చూడొచ్చు. లేదూ ఓడిపోయినా, ఏ ప్రభావం చూపించలేకపోయినా ఆందోళన అక్కర్లేదు. తలపతి మూవీ కాబట్టి చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ థియేటర్లకు పరుగులు పెడతారు. కాకపోతే ఈవెంట్లు గట్రా చేసే అవకాశాలు ఉండవు.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో రానుంది. ఒకవేళ మే 8 మిస్ చేసుకుంటే మటుకు మే చివరి వారానికి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. లేదూ అంటే టాక్సిక్ వదులుకున్న జూన్ 4 తీసుకోవచ్చు. రెండూ కెవిఎన్ బ్యానర్ సినిమాలే. తమిళం వరకు పెద్దగా సమస్య లేదు కానీ జన నాయకుడు తెలుగుతో సహా ఇతర భాషల్లో ఏ మేరకు పెర్ఫార్మ్ చేస్తుందనేది అనుమానంగా ఉంది. భగవంత్ కేసరి రీమేక్ కావడం వల్ల మన దగ్గర విజయ్ మేజిక్ పని చేయడం డౌటే.

భారీ ఓటిటి డీల్ చేజారిపోవడం, పైరసీ వల్ల సినిమా గురించి కొన్ని ముఖ్యమైన లీక్స్ ముందే బయటికి రావడం లాంటివి జన నాయకుడు బజ్ ని తగ్గించేశాయి. విజయ్ ఫ్యాన్స్ నమ్మకం ఒకటే. సినిమా బాగున్నా లేకపోయినా స్క్రీన్ మీద తమ హీరోని సెలెబ్రేట్ చేసుకునే తీరతామని బల్లగుద్ది చెబుతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ డ్రామాలో మమిత బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చారు.