వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని ఎగరేసుకుపోతుంది. దీని వల్ల నీతి ఏంటయ్యా అంటే ముందే జాగ్రత్త పడి సగం సగం రొట్టె పంచుకుంటే ఏ గొడవా వచ్చేది కాదు. అలా జరగనుందు వల్ల ఇంకెవరెవరో లాభ పడతారు. అసలు విషయం ఏంటంటే జూన్ 4 టాక్సిక్ విడుదల లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ పరిస్థితులు చూస్తుంటే ఆ మాట మీద ఉండటం కష్టమే అనిపిస్తోంది.
మళ్ళీ వాయిదా పడొచ్చని, జన నాయగన్ టెన్షన్లలో ఉన్న కెవిఎన్ ప్రొడక్షన్స్ మరికొంత సమయం కోరుతోందని, అందుకే టాక్సిక్ పోస్ట్ పోన్ తప్పకపోవచ్చని బెంగళూరు టాక్. ఇంకోవైపు ఈ డేట్ తీసుకుందామని ఆలోచించిన పెద్ది ఫైనల్ గా జూన్ 25కి వెళ్ళిపోయింది. ఇది కూడా అధికారికంగా ప్రకటించలేదు కానీ డిస్ట్రిబ్యూటర్ టాక్ అయితే వినిపిస్తోంది. ఇలా జూన్ 4 స్లాట్ ఖాళీ అయ్యేలా ఉండటంతో సత్యదేవ్ రావు బహద్దూర్ జూన్ 5 రిలీజ్ కన్ఫర్మ్ చేసుకుని ప్రకటన ఇచ్చేసింది.
ఒకవేళ టాక్సిక్ వచ్చే పక్షంలో మళ్ళీ నిర్ణయం మార్చుకుంటారేమో కానీ ప్రస్తుతానికి లాక్ అయితే చేసుకున్నారు. ఇది తెలివైన ఎత్తుగడ. గాయపడ్డ సింహం, జెట్లీలు ఇలాంటి స్ట్రాటజితోనే పెద్ది వదులుకున్న ఏప్రిల్ 30ని ఒక రోజు ఆలస్యంగా వచ్చి క్యాష్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు రావు బహద్దూర్ అదే బాటలో ఉంది. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన ఈ మూవీకి మహేష్ బాబు కీలక నిర్మాణ భాగస్వామి. నమ్రతనే దగ్గరుండి చూసుకున్నారు.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన రావు బహద్దూర్ లో సత్యదేవ్ చాలా షాకింగ్ లుక్స్ లో కనిపించనున్నాడు. చాలా కాలంగా తనకు సక్సెస్ లేదు. చిరంజీవి గాడ్ ఫాదర్ లో విలన్ గా నటించినా, కృష్ణమ్మలో సోలో హీరోగా చేసినా పని జరగలేదు. సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకటి రెండు సినిమాలు ఫస్ట్ కాపీ దగ్గర ఆగిపోయాయి. అన్నీ తీరాలంటే రావు బహద్దూర్ సూపర్ డూపర్ హిట్ కావాలి. సత్యదేవ్, వెంకటేష్ మహాలో ఆ కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తోంది. చూడాలి ఏమవుతుందో.
చరణ్ యష్ అనుకుంటే సత్యదేవ్ వస్తున్నాడు
Gulte Telugu Telugu Political and Movie News Updates