రజినీ… మళ్లీ రికార్డ్ బ్రేక్ చేశాడా?

సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకప్పుడు సౌత్ ఇండియాలో ఏ హీరోకూ అందని రేంజిలో ఉండేవారు. ఆయన సినిమాల బడ్జెట్లు, బిజినెస్‌లు, కలెక్షన్లు.. అన్నీ వేరుగా ఉండేవి. పారితోషకం కూడా ఇంకెవరికీ సాధ్యం కాని స్థాయిలో అందుకునేవారు. కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితులు మారిపోయాయి. రజినీ కెరీర్ డౌన్ అయితే ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్.. ఇలా చాలామంది స్టార్లు ఆయన్ని దాటి ముందుకు వెళ్లిపోయారు.

ఐతే తన స్థాయి పడిపోతున్న దశలో రజినీ మూడేళ్ల ముందు ‘జైలర్’ మూవీతో బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆ చిత్రం రూ.500 కోట్లకు పైగా వసూళ్లతో కోలీవుడ్ కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టింది. ఇక గత ఏడాది డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘కూలీ’ సినిమాతోనూ రజినీ వసూళ్ల మోత మోగించాడు. ఇప్పుడు సూపర్ స్టార్ నుంచి రాబోతున్న ‘జైలర్-2’ మీద అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా ఆల్ టైం రికార్డులు నెలకొల్పడం లాంఛనమే అని భావిస్తున్నారు.

ఐతే థియేటర్ల దగ్గర ప్రకంపనలు రేపడానికి ముందే ‘జైలర్-2’ డిజిటల్ మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమేజాన్ ప్రైమ్ సంస్థ ఏకంగా రూ.160 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ‘జైలర్-2’ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌కు అమేజాన్ వాళ్లతో డిజిటల్ డీల్ గురించి కొంత కాలంగా సంప్రదింపులు జరుపుతోంది. ‘జైలర్’ మూవీని రూ.75 కోట్లకు అమేజాన్‌కే ఇవ్వగా.. ఆ సంస్థకు మంచి ప్రయోజనం దక్కింది. రజినీ చివరి చిత్రం ‘కూలీ’ని సైతం ప్రైమ్‌కే ఇచ్చారు. రేటు రూ.120 కోట్లు.

ఆ సమయానికి తమిళంలో అదే రికార్డు రేటు. ఇప్పుడు దాని మీద 25 శాతం రేటు పెంచి ‘జైలర్-2’ డిజిటల్ రైట్స్‌ను రికార్డు రేటుకు అమ్మింది సన్‌ పిక్చర్స్ సంస్థ. 75 ఏళ్ల వయసులోనూ రజినీ ఇంకా ఇలా రికార్డులు నెలకొల్పుతుండడం ఆయన స్టార్ పవర్‌ను సూచిస్తుంది. ‘జైలర్-2’కు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. ఈ చిత్రం కోలీవుడ్లో చాలా ఏళ్ల పాటు నిలబడిపోయే బాక్సాఫీస్ రికార్డులను నెలకొల్పడం ఖాయం. నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశముంది.