ఎమ్మెస్ రాజు… మళ్లీ వచ్చారూ

శత్రువు, దేవి, దేవిపుత్రుడు, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నిర్మాత.. ఎం.ఎస్.రాజు. ఇప్పుడు నంబర్ వన్ ప్రొడ్యూసర్‌గా వెలుగొందుతున్న దిల్ రాజు సైతం తనకు ఎం.ఎస్.రాజునే ఇన్‌స్పిరేషన్ అంటారు. ఒక సమయంలో తెలుగు సినిమాలో తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించిన రాజు.. తర్వాత వరుస ఫ్లాపుల వల్ల వెనుకబడిపోయారు. క్రమంగా సినిమాల నిర్మాణానికే దూరం అయిపోయారు. 

నిర్మాతగా పెద్ద స్థాయిలో ఉండగానే ఆయన దర్శకుడిగా మారి ‘వాన’ అనే రీమేక్ మూవీ తీశారు. అది డిజాస్టర్ అయింది. తర్వాత కొడుకును హీరోగా పరిచయం చేస్తూ ‘తూనీగ తూనీగ’ తీస్తే అదీ ఆడలేదు. ఇవి సొంత బేనర్లో తీసిన సినిమాలే. తర్వాత బ్రేక్ తీసుకున్న రాజు.. డర్టీ హరి, మళ్ళీ పెళ్ళి లాంటి క్రేజీ సినిమాలు తీసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. సెన్సేషనల్ సబ్జెక్టులు కావడం వల్ల అవి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. రిజల్ట్ కూడా ఓకే. 

దర్శకుడిగా ఎం.ఎస్.రాజు స్థాయిని అయితే ఆ సినిమాలు పెంచలేకపోయాయి. ఐతే ఇప్పుడాయన ట్రెండుకు తగ్గట్లుగా ఒక భారీ సినిమాతో రాబోతున్నారు. ఆ సినిమా పేరు.. అగధ. ఆది వరాహ ప్రొడక్షన్స్ బేనర్ మీద కాశీ విశాలాక్షి బలుసు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాంతార, కార్తికేయ-2, విరూపాక్ష లాంటి చిత్రాల తర్వాత డివైన్, మిస్టిక్ ఎలిమెంట్స్ నేపథ్యంలో సినిమాలు తీయడం ట్రెండుగా మారిన సంగతి తెలిసిందే. రాజు సైతం ఆ బాటలోనే సాగుతున్నారు. 

ఒక భయంకరమైన అవతారం ముందుఒక మహిళ నిలబడి ఉన్న ప్రి లుక్ పోస్టర్‌తో రాజు బాగానే క్యూరియాసిటీ రేకెత్తించాడు. ఈ చిత్రాన్ని ఆయన పాన్ ఇండియా స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిందట. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు జస్ట్ టైటిల్, ప్రి లుక్ పోస్టర్ మాత్రమే రివీల్ చేశారు. ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నదెవరో తర్వాత వెల్లడిస్తారట. ఈ చిత్రానికి అందరూ కొత్త టెక్నీషియన్లే పని చేస్తున్నారు.