ప‌వ‌న్ ద‌ర్శకుడితో జార్జిరెడ్డి హీరో

వీర శంక‌ర్ గుర్తున్నాడా? ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో గుడుంబా శంక‌ర్ లాంటి భారీ చిత్రం తీసిన ద‌ర్శ‌కుడ‌త‌ను. ఆ సినిమా అంచ‌నాలను అందుకోలేక‌పోయింది. అత‌ను అడ్ర‌స్ లేకుండా పోయాడు. నిజానికి గుడుంబా శంక‌ర్ కంటే ముందు కూడా వీర‌శంక‌ర్ లైమ్ లైట్లో లేడు. అప్పుడెప్పుడో శ్రీకాంత్ హీరోగా తెర‌కెక్కిన హ‌లో ఐ ల‌వ్యూ సినిమాతో అత‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత ప్రేమ కోసం, విజ‌య‌రామ‌రాజు లాంటి సినిమాలు తీశాడు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనుకోకుండా టీవీలో హ‌లో ఐ ల‌వ్యూ సినిమా చూసి ఇంప్రెస్ అయిపోయి వీర శంక‌ర్‌ను పిలిపించుకుని గుడుంబా శంక‌ర్ చేసే అవ‌కాశం ఇచ్చాడు. ఆ సినిమా రైటింగ్, మేకింగ్‌లో ప‌వ‌న్‌దే కీ రోల్ కాగా.. వీర‌శంక‌ర్ దర్శ‌కుడిగా ఉన్నాడు.

ఐతే గుడుంబా శంక‌ర్‌కు మంచి హైప్ అయితే వ‌చ్చింది కానీ.. సినిమా ఆడ‌లేదు. దీంతో వీర శంక‌ర్ మ‌ళ్లీ క‌నుమ‌రుగైపోయాడు. క‌న్న‌డ‌లో రెండు సినిమాలు తీసిన వీర‌శంక‌ర్.. తెలుగులోనూ ఏవో రెండు చిన్న సినిమాలు తీశాడు. ఇప్పుడ‌త‌ను.. ఓ కొత్త సినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఆ చిత్రం పేరు.. గంధ‌ర్వ‌.

ఇందులో వంగ‌వీటి, జార్జిరెడ్డి చిత్రాల క‌థానాయ‌కుడు సందీప్ మాధ‌వ్ హీరోగా న‌టించ‌నున్నాడు. అప్స‌ర్ హుసేన్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నాడు. ఎం.ఎన్.మ‌ధు ఈ చిత్రానికి నిర్మాత‌. థియేట‌ర్ ఫీల్డ్ నుంచి వ‌చ్చిన సందీప్.. వంగ‌వీటి, జార్జిరెడ్డి చిత్రాల‌తో మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. ఐతే ఆ సినిమాలే అనుకున్నంత‌గా ఆడ‌లేదు. గంధ‌ర్వ‌తో అయినా అత‌ను తొలి స‌క్సెస్ అందుకుంటాడేమో చూడాలి. ఈ సినిమాతో వీర శంక‌ర్ ఎలాంటి ముద్ర వేస్తాడో మ‌రి.