ప్రస్తుతం టాలీవుడ్లో తర్వాత రాబోయే పెద్ద సినిమా.. పెద్దినే. వేసవికి షెడ్యూల్ అయిన ఏకైక పెద్ద చిత్రమిది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడ్డ ఆ మూవీ.. ఈ డేట్‌కు కూడా కట్టుబడి ఉంటుందా అన్నది సందేహంగానే ఉంది. వాయిదా లాంఛనమే అంటున్నారు. మరి కొన్ని రోజుల్లో కొత్త డేట్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ దిశగా అభిమానులను ముందే ప్రిపేర్ చేసేసిన టీం.. మిగతా పనుల మీద దృష్టిసారించింది.
ఈ చిత్రంలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉంటుందని.. అందులో డ్యాన్సులు అదిరిపోతాయని కొన్ని రోజుల ముందే సమాచారం బయటికి వచ్చింది. ఈ పాటలో చరణ్‌తో పాటు డ్యాన్స్ చేసే హీరోయిన్‌కు సంబంధించి రకరకాల పేర్లు వినిపించాయి. చివరగా మృణాల్ ఠాకూర్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటిదాకా తెలుగులో గ్లామర్ పాత్ర చేయని మృణాల్.. తొలిసారి ఐటెం సాంగ్ చేస్తే ఎలా ఉంటుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఐతే మృణాల్ ‘పెద్ది’ పాట చేయబోతోందని ఫిక్సయిపోయి భారీ అంచనాలతో ఉన్న మెగా అభిమానులకు దర్శకుడు బుచ్చిబాబు సానా పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో మృణాల్ నర్తించదట. ‘కపుల్ ఫ్రెండ్లీ’తో మంచి గుర్తింపు సంపాదించిన తెలుగమ్మాయి మానస వారణాసిని ఈ పాటలో చూడబోతున్నామట. ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా మానసను ఈ పాట కోసం ఓకే చేశారట.
మానస కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న అమ్మాయి. ఆమె ఇప్పటిదాకా తెలుగులో చేసిన రెండు సినిమాల్లో తన గ్లామర్ హైలైట్ అవ్వలేదు. ‘కపుల్ ఫ్రెండ్లీ’లో అయితే ఒక మామూలు మధ్య తరగతి అమ్మాయిలా కనిపించింది. పెర్ఫామెన్స్‌తో మెప్పించింది. ఆమె ఐటెం సాంగ్‌లో కనిపించడం అన్నది కచ్చితంగా షాకే. దీన్ని మెగా ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో చెప్పలేం. ఇప్పటికైతే ఇది కేవలం సమాచారం మాత్రమే.. ఎంతవరకు లాక్ అయ్యిందో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.
చాలా ఏళ్లుగా ఐటెం సాంగ్స్ కూడా పెద్ద హీరోయిన్లే చేస్తున్నారు. చరణ్ సినిమా అంటే స్పెషల్ సాంగ్ చేసే హీరోయిన్‌కు కూడా ఒక రేంజ్ ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తారు. కానీ బుచ్చిబాబు వారి ఆకాంక్షలకు భిన్నంగా వెళ్తున్నాడు. మరి మానస ఎలా మెప్పిస్తుందో.. తెరపై ఈ పాట ఎలా పండుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates