డెకాయిట్ ఛాన్సుకి అదొక్కటే అడ్డంకి

ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్ 10 థియేటర్లలో అడుగు పెట్టనుంది. ముందు రోజు ప్రీమియర్లు వేయాలా వద్దానే దాని మీద నిర్మాత సుప్రియ యార్లగడ్డ ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కంటెంట్ మీద చాలా ధీమాగా అయితే ఉన్నారు. షానియేల్ డియో దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కం ఎమోషనల్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కాగా భీమ్స్ సంగీతం సమకూర్చారు.

ఇక అసలు విషయానికి వస్తే డెకాయిట్ కు చాలా సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఎందుకో చూద్దాం. మొన్న విడుదలైన బైకర్ మంచి టాక్ ఉన్నప్పటికీ మొదటి వీకెండ్ కే స్ట్రగులవుతుండగా రాకాస దాని కన్నా కాస్త మెరుగ్గా వేగంగా బ్రేక్ ఈవెన్ వైపు వెళ్తోంది. అయితే ఈ రెండు యునానిమస్ టాక్ తెచ్చుకోలేదు. డీసెంట్ టాక్స్ తోనే రన్ అవుతున్నాయి. ఇంకా దూకుడు పెంచుతాయని అనుకోవడానికి లేదు. సో డెకాయిట్ కు శర్వా, సంగీత్ వల్ల వచ్చిన ఇబ్బంది అయితే లేదు.

ఇక డెకాయిట్ తో పాటుగా అదే రోజు రెండు డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. మొదటిది ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. కృతి శెట్టి హీరోయిన్ కాగా విగ్నేష్ శివన్ దర్శకుడు. ఎందుకో కంటెంట్ పరంగా ఇది ఆడియన్స్ లో ఏమంత ఆసక్తి రేపలేకపోతోంది. టెక్నాలజీ ప్రపంచంలో ప్రేమకథలు ఎలా ఉంటుందనే పాయింట్ టచ్ చేసిన దర్శకుడు వాటిని ఎంత కన్విన్సింగ్ గా చూపిస్తారనేది ఫలితాన్ని శాసించనుంది. ఓపెనింగ్స్ వరకు ప్రదీప్ ఇమేజ్ పని చేస్తుంది.

అర్థం కాని మలయాళం పేరు పల్లి చట్టంబిని టైటిల్ గా పెట్టుకుని వస్తున్న టోవినో థామస్ ఈసారి సీరియస్ ఇష్యూనే తీసుకున్నాడు కానీ నేటివిటీ పరంగా మనవాళ్లకు ఎంత కనెక్ట్ అవుతుందో చెప్పడం కష్టమే. కయదు లోహర్ హీరోయిన్ కావడం కొంత ప్లస్ అవుతోంది. అంచనాల పరంగా దీని మీద టాలీవుడ్ జనాలకు ఆసక్తి కలగాలంటే రిలీజ్ రోజు ఎక్స్ ట్రాడినరి టాక్ రావాల్సిందే.

సో అన్ని రకాలుగా డెకాయిట్ కు మంచి గ్రౌండ్ దొరుకుతోంది. దాని మీద భారీ ఇన్నింగ్స్ ఆడటమే మిగిలింది. కాకపోతే డెకాయిట్ కు వచ్చిన చిక్కు ఒక్కటే. ఐపీఎల్ మంచి ఊపులో ఉంది. ఆ మేనియా నుంచి జనాన్ని బయటికి లాకొచ్చి థియేటర్లకు వచ్చేలా చేయడం అడివి శేష్ బృందానికి సవాలే.