మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌లో ఊహించ‌ని విషాదం

కొన్ని నెల‌ల కిందట సాచి అనే మేటి ద‌ర్శ‌కుడిని కోల్పోయింది సినీ ప‌రిశ్ర‌మ‌. ఈ ఏడాది ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌టిగా నిలిచిన అయ్య‌ప్ప‌నుం కోషీయుం ద‌ర్శ‌కుడ‌త‌ను. అంత‌కుముందు అత‌ను ర‌చ‌యిత‌గా డ్రైవింగ్ లైసెన్స్ సహా కొన్ని క్లాసిక్స్ అందించాడు. అలాంటి ద‌ర్శ‌కుడు గుండెపోటుతో చ‌నిపోవ‌డం మ‌ల‌యాళ సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం నింపింది.

ఇప్పుడు ఆ ప‌రిశ్ర‌మ ఒక మంచి న‌టుడిని కోల్పోయింది. అత‌డి పేరు.. అనిల్ నెడుమంగ‌డ్. ఇతను కూడా అయ్య‌ప్ప‌నుం కోషీయుం సినిమాతో ముడిప‌డ్డ వాడే కావ‌డం గ‌మ‌నార్హం. ఆ చిత్రం చూసిన వాళ్ల‌కు ఎస్పీ పాత్ర‌లో చ‌క్క‌టి న‌ట‌న క‌న‌బ‌రిచిన న‌టుణ్ని మ‌రిచిపోలేరు. ఆ న‌టుడే అనిల్ నెడుమంగడ్. ఇంత‌కుముందు క‌మ్మ‌టిపాదం, పావడ లాంటి సినిమాల‌తో స‌త్తా చాటాడు అనిల్. అయ్య‌ప్పునుం కోషీయుం అత‌డికి చాలా పేరు తెచ్చింది.

శుక్ర‌వారం సాచి పుట్టిన రోజు. దాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం ఒక భావోద్వేగ ఫేస్ బుక్ పోస్టు కూడా పెట్టాడు అనిల్. త‌ర్వాత కొన్ని గంట‌ల‌కే అత‌ను చ‌నిపోయాడు. జోసెఫ్ ఫేమ్ జోజు జార్జ్ హీరోగా న‌టిస్తున్న ఓ సినిమా చిత్రీక‌ర‌ణ కోసం అనిల్.. తొడుపుళ ప్రాంతంలో ఉన్నాడు. అదే ప్రాంతంలో ఉన్న మ‌లంక‌ర డ్యామ్ ద‌గ్గ‌రికి స్నేహితుల‌తో విహారానికి వెళ్లాడు. అక్క‌డ నీటిలో దిగి స్నానం చేస్తున్న స‌మ‌యంలో అదుపు త‌ప్పి మునిగిపోయి ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స‌మాచారం.

ఇంత మంచి న‌టుడు ఇలా అర్థంత‌రంగా త‌నువు చాలించ‌డం మ‌ల‌యాళ సినీ ప‌రిశ్ర‌మ‌కు పెద్ద షాక్. ఒక గొప్ప సినిమాలో భాగ‌మైన ఇద్ద‌రు ఇలా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో చనిపోవ‌డం.. అది కూడా ముందు చ‌నిపోయిన సాచి పుట్టిన రోజు నాడు అత‌డి గురించి పోస్టు పెట్టిన కొన్ని గంట‌ల్లో అనిల్ త‌నువు చాలించ‌డం అక్క‌డి సినీ జ‌నాలు జీర్ణించుకోలేక‌పోతున్నారు.