ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ స్ట్రాటజీ బ్రహ్మాండంగా వర్కౌట్ అయితే కొన్నిసార్లు మిస్ ఫైర్ అవుతుంది. లాభపడిన వాళ్ళు ఎంత ఉన్నారో నష్టపోయిన వాళ్ళు అంతకు రెట్టింపు ఉంటారు. అయినా సరే కాన్ఫిడెన్స్, కంటెంట్ ముందు ఇలాంటి లెక్కలు పని చేయవు. ఎల్లుండి ఏప్రిల్ 3 బైకర్, రాకాస ఒకేరోజు థియేటర్లలు అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే.

ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తామనే ధీమాతో రెండు సినిమాలు ప్రీమియర్లకు రెడీ అయిపోయాయి. ముందు బైకర్ ప్రకటన వచ్చింది. రేపు రాత్రి హైదరాబాద్ లో ఉన్న ప్రీమియం స్క్రీన్లలో మాత్రమే స్పెషల్ షోలు వేస్తామని అనౌన్స్ చేశారు. తర్వాత రాకాస అలెర్ట్ అయిపోయి షోలను కేవలం భాగ్యనగరానికి పరిమితం చేయకుండా ఏపీ తెలంగాణ మెయిన్ సెంటర్స్ లో ముందు రోజు సాయంత్రం నుంచే షోలు వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

సో టాక్స్ ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి శుక్రవారం దాకా వేచి చూడాల్సిన అవసరం లేదు. గురువారం అర్ధరాత్రికి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. దురంధర్ ది రివెంజ్ తప్ప మరో ఆప్షన్ లేకపోవడంతో ఆడియన్స్ కొత్త సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. బ్యాండ్ మేళం, యూత్, హ్యాపీ రాజ్ మొదలైనవి తీవ్రంగా నిరాశ పరచడంతో సోమవారం నుంచి థియేటర్లు బోసిపోతున్నాయి. మళ్ళీ అవి కళకళలాడటం శర్వానంద్, సంగీత్ శోభన్ చేతిలో ఉంది.

ప్రమోషన్లు, ట్రైలర్లు గట్రా చూస్తుంటే రెండూ ప్రామిసింగ్ గానే ఉన్నాయి. మధ్యలో సముతిరఖని తమిళ డబ్బింగ్ మూవీ కార్మేని సెల్వం కూడా ఉంది కానీ దాని మీద ఎలాంటి బజ్ లేదు. టైటిల్ ని యథాతథంగా తమిళే పెడితే బజ్ మీద ప్రభావం పడుతోందని తెలిసినా ఏవో కారణాలు చెప్పి యధాతథంగా ఉంచేస్తున్నారు కానీ మార్చే ప్రయత్నం చేయడం లేదు. ఫైనల్ గా ఏప్రిల్ బోణీ ఎవరు చేయబోతున్నారో వేచి చూడాలి. రెండూ హిట్టయితే బయ్యర్ వర్గాలకు పెద్ద బూస్ట్ దొరికినట్టు అవుతుంది.