బన్నీని సతాయించేస్తున్న సుక్కు

టాలీవుడ్ హీరోల ఆధారంగా నడిచే ఇండస్ట్రీ. ఇక్కడ వాళ్లదే ఆధిపత్యం. ఒక సినిమాకు అత్యంత కీలకమైన వ్యక్తి దర్శకుడే అయినా సరే.. ఇక్కడ హీరోలను కాదని ఎవ్వరూ ఏమీ చేయడానికి లేదు. స్టార్ స్టేటస్ తెచ్చుకున్న హీరోతో దర్శకులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. వాళ్లు కోరుకున్నట్లే షూటింగ్‌లు జరగాల్సి ఉంటుంది. హీరోలను మరీ కష్టపెట్టే సాహసం దర్శకులు, నిర్మాతలు చేయరు.

ఐతే స్టార్ హీరోలు తాము ఎక్కువగా అభిమానించే, గౌరవించే దర్శకుల దగ్గర మాత్రం రాజీ పడతారు. అవసరానికి మించి కష్టపడతారు. పట్టింపులకు పోరు. అల్లు అర్జున్ ఇలా అభిమానించే, గౌరవించే దర్శకుల్లో సుకుమార్ ఒకడు. ‘ఆర్య’ సినిమాతో బన్నీకి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది సుక్కునే. అందుకే ఆయనంటే బన్నీకి ప్రత్యేక అభిమానం. ఈ అభిమానంతోనే ‘పుష్ప’ విషయంలో తనను ఎంతగా కష్టపెడుతున్నా బన్నీ భరిస్తున్నాడట.

నెల కిందటే ‘పుష్ప’ చిత్రీకరణ తూర్పుగోదావరిలోని మారేడుమిల్లిలో ఆరంభమైన సంగతి తెలిసిందే. అక్కడో రెండు వారాలు నిర్విరామంగా చిత్రీకరణ చేశారు. ఆ సందర్భంగా అడవిలో బన్నీని చాలానే కష్టపెట్టాడట సుక్కు. అసలే అటవీ ప్రాంతంలో షూటింగ్.. పైగా ఎక్కువగా తీసింది యాక్షన్ సీన్స్. ప్రతి షాట్‌ను మూణ్నాలుగు యాంగిల్స్‌లో తీయడం.. ఒక పట్టాన షాట్‌ను ఓకే చేయకపోవడం.. ఇదంతా చూసి బన్నీని సుక్కు ఇంతగా కష్టపెట్టేస్తున్నాడేంటి అని యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారట.

కరోనా దెబ్బ వల్ల అక్కడ షూటింగ్‌కు అనుకోకుండా బ్రేక్ పడగా.. కొంత విరామం తర్వాత తాజాగా హైదరాబాద్‌లోని కాచిగూడలో కొత్త షెడ్యూల్ మొదలైంది. అక్కడ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. నాలుగైదు రోజులుగా రాత్రి సన్నివేశాలు తీస్తున్నారు. ఇందుకోసం పూర్తిగా బన్నీ నాలుగు రోజులు నైట్ ఔట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

తాజాగా ఒక రోజు రాత్రి మొదలుపెట్టి ఉదయం 7 గంటల వరకు చిత్రీకరణ సాగించారట. ఒక పట్టాన సుక్కు షాట్ ఓకే చేయకపోవడంతో బన్నీ అలసిపోయి.. తన జీవితంలో ఏ సినిమాకూ ఇంత కష్టపడలేదని అన్నట్లు యూనిట్ వర్గాల సమాచారం. మరో దర్శకుడైతే బన్నీ ఇదంతా భరించేవాడు కాదని, సుక్కు మీద ఉన్న అభిమానం, ఆయన పర్ఫెక్షన్ మీద ఉన్న గురి కారణంగానే ఇంత కష్టపడుతున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.