శ్రీలీలకు టైం కలిసి రావడం లేదే

ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ఫైనల్ ఫలితం తేలడానికి టైం పడుతుంది కానీ మిక్స్డ్ రెస్పాన్స్ కొనసాగడం, దురంధర్ ది రివెంజ్ ఆధిపత్యం చెలాయించడం స్పష్టంగా కనిపిస్తోంది. హిట్టయినా కాకపోయినా పవన్ కళ్యాణ్ ఫీలయ్యేది పెద్దగా లేదు కానీ హీరోయిన్ శ్రీలీల ఈ మూవీ మీద గంపెడు ఆశలు పెట్టుకుంది. గుంటూరు కారం తరహాలో కాకుండా పెద్ద బ్లాక్ బస్టర్ దక్కి తన ఫ్లాపుల ప్రవాహానికి బ్రేక్ వేస్తుందని బలంగా నమ్మింది. అయితే ఆ కోరిక పూర్తిగా నెరవేరేలా లేదు.

ఎందుకంటే శ్రీలీల కేవలం సెకండాఫ్ కు మాత్రమే పరిమితమయ్యింది. అది కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. ఆ పాత్రకు ఇచ్చిన ముగింపు ఊహించిందే కాబట్టి పెద్దగా సర్ప్రైజ్ లేదు కానీ ఉన్నంతలో తను యాక్టివ్ గా కనిపించిన మాట వాస్తవం. అయితే కేవలం ఈ క్యారెక్టర్ ఆధారంగా శ్రీలీల మార్కెట్ పెరగడమో ఆఫర్లు క్యూ కట్టడమో జరగదు. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తిగా పవన్ కళ్యాణ్ స్వాగ్, టైమింగ్ తో నడిచిపోయిన ఫ్యాన్ కంటెంట్. వస్తున్న వసూళ్లూ దాని వల్లే.

ఇదే కాదు జనవరిలో శ్రీలీల నటించిన తమిళ డెబ్యూ పరాశక్తి బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. కోలీవుడ్ లో భారీ ప్రచారం చేసినా ఆడియన్స్ తిరస్కరించారు.ఆఖరికి తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్ కాకుండా నేరుగా ఓటిటిలో విడుదల చేశారు. పెర్ఫార్మన్స్ స్కోప్ దక్కినా రిజల్ట్ ఇలా రావడం పట్ల తను నిరాశ చెందే ఉంటుంది. ఇప్పుడు పవన్ సరసన జోడి కట్టడం ఒక డ్రీం లాంటిది అనుకున్నా అది గుర్తుండిపోయేలా లేకపోవడం ఒక లోటుగా ఉంటుంది.

శ్రీలీల త్వరలో బాలీవుడ్ తెరంగేట్రం చేయనుంది. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న లవ్ స్టోరీ చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. ధనుష్ సరసన మరో తమిళ మూవీ సెట్స్ మీద ఉంది. తెలుగులో కొత్తగా కమిట్ మెంట్లు ఇవ్వలేదు. ఉస్తాద్ కన్నా ముందు మాస్ జాతర, జూనియర్, రాబిన్ హుడ్, ఎక్స్ ట్రాడినరి మ్యాన్, ఆదికేశవ అన్నీ పోయాయి. ఒక్క భగవంత్ కేసరి మాత్రమే సూపర్ హిట్ గా నిలిచింది. అయితే దాని క్రెడిట్ అధిక శాతం బాలయ్య ఖాతాలోకి వెళ్ళిపోయింది.